ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు దీక్ష విరమించారు. గడచిన వారం రోజులుగా లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలోనే ఆయన దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో ఎట్టకేలకు ఎల్జీ జోక్యం చేసుకున్నారు. అధికారులంతా సెక్రటేరియట్ వెళ్లాలనీ, ముఖ్యమంత్రి కూడా అక్కడికే వెళ్లి వారితో చర్చలు జరుపుకోవాలని ఆయనా చెప్పారు. అయితే, దీంతోపాటు కేజ్రీవాల్ దీక్ష విరమణకు ఇతర కారణాలు కూడా లేకపోలేదు. ఎల్జీ కార్యాలయంలో దీక్ష చేయడానికి వీల్లేదని సోమవారమే హైకోర్టు చెప్పింది. తదుపరి విచారణను 22కి వాయిదా వేసింది. ఆరోజు విచారణలో దీక్షను వెంటనే లేపేయాలని కోర్టు ఆదేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అంచనాలున్నాయి.
పరిస్థితిని అంతవరకూ తీసుకెళ్తే, న్యాయ వ్యవస్థతో కూడా మరో కొత్త తగాదా తలకెత్తుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. అందుకే కేజ్రీవాల్ దీక్షకు ఫుల్ స్టాప్ పెట్టారనీ చెప్పుకోవచ్చు. ఇంకోపక్క, ఆయన దీక్షలో కూర్చుండేసరికి సాధారణ పాలనా వ్యవహారాలు కూడా చతికిలపడ్డాయనే భావన ఢిల్లీ ప్రజల్లో పెరుగుతోంది. ఈ మధ్య ఢిల్లీలో వరుస కరెంటు కోతలు పెరిగాయి, దీంతోపాటు ఇతర అంశాల్లో కూడా ప్రభుత్వం పట్టుతప్పుతోందన్న అభిప్రాయం ప్రజలకు కలిగే అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో వ్యతిరేకతను పెంచుకోవడం సరైంది కాదనే ఆలోచన కూడా కేజ్రీవాల్ పట్టుదల సడలింపు వెనక పనిచేసి ఉంటుందనే విశ్లేషణలూ ఉన్నాయి.
అయితే, ఈ ఎపిసోడ్ ద్వారా కేజ్రీవాల్ నేర్చుకోవాల్సిన పాఠం ఏదైనా ఉందా.. అంటే, ఉందనే చెప్పాలి. అదేంటంటే, పరిపాలన అంటే అందర్నీ కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉందీ అనేది. కొన్ని పరిమితులకు లోబడి పనిచేయక తప్పని పరిస్థితి ఉందనీ తెలుసుకోవాలి. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి, రాజకీయ కక్ష అనేది పక్కనపెడితే… రాష్ట్రంలో సాధారణ పాలన సజావుగా సాగాలంటే కొంత సర్దుబాటు ధోరణిని ఆప్ నేతలు అలవర్చుకోవాల్సిన అవసరం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. తనకు అధికారులతో సమస్యలేదు, కేవలం ఎల్జీతోనే సమస్య అని కేజ్రీవాల్ అంటున్నా… ఈ క్రమంలో పాలన అశ్రద్ధ చెయ్యొద్దనే అభిప్రాయం ఢిల్లీ వాసుల నుంచి తీవ్రంగానే వ్యక్తమౌతోంది. తన దీక్ష ద్వారా దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ తనవైపు తిప్పుకోవడంలో కేజ్రీవాల్ విజయం సాధించారనే చెప్పాలి. ఇతర రాష్ట్రాల నుంచి మద్దతు కూడా పొందగలిగారు.