ఒకప్పుడు డిల్లీ మరియు డిస్ట్రిక్ట్ క్రికెట్ బోర్డుకి అధ్యక్షుడుగా ఉన్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, స్టేడియం నిర్మాణం పేరిట భారీగా నిధులను స్వాహా చేసారంటూ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. దానికి ఆగ్రహించిన అరుణ్ జైట్లీ తనపై నిరాధారమయిన ఆరోపణలు చేసి తన పరువు ప్రతిష్టలకి భంగం కలిగించారని ఆరోపిస్తూ అరవింద్ కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేశారు. అరవింద్ కేజ్రీవాల్ తో బాటు ఆమాద్మీ పార్టీ నేతలు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ చద్ద, దీపక్ బాజ్ పేయిలపై కూడా జైట్లీ దావా వేశారు.
దానిని ఈరోజు విచారణకు స్వీకరించిన డిల్లీ న్యాయస్థానం ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ని ఈ కేసులో విచారణ నిమిత్తం వ్యక్తిగతంగా కోర్టుకి రమ్మని నోటీసు ఇవ్వాలా వద్దా అనే దానిపై మార్చి 9వ తేదీన తమ నిర్ణయం తెలుపుతామని ప్రకటించింది.
తనపై అరుణ్ జైట్లీ పరువు నష్టం దావా వేయడాన్ని అరవింద్ కేజ్రీవాల్ కూడా స్వాగతించారు. జైట్లీపై తను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని కూడా చెప్పారు కానీ ఆయన ఇంతవరకు తన ఆరోపణలను నిరూపించే ఆధారాలేవీ సమకూర్చుకొన్నట్లు లేదు. దీనిపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించేందుకు ఆయన ఏక సభ్య కమిటీని నియమించారు కానీ దాని నివేదికలోను అరుణ్ జైట్లీ బోర్డు అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినట్లుగా ఎటువంటి ఆధారాలను చూపలేకపోయింది. కనుక అరుణ్ జైట్లీపై చేసిన ఆరోపణలని నిరూపించేందుకు అరవింద్ కేజ్రీవాల్ తప్పనిసరిగా కోర్టుకి తగిన సాక్ష్యాధారాలు నిరూపించాల్సి ఉంటుంది. లేకుంటే ఈ పరువు నష్టం కేసులో అరుణ్ జైట్లీకి కోటి రూపాయలు చెల్లించుకోవలసి ఉంటుంది.