ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడంతో పాటు స్వయంగా కేజ్రీవాల్ కూడా ఎమ్మెల్యేగా పరాజయం పాలవడంతో ప్రజాప్రతినిధిగా ఉండే అవకాశాన్ని కేజ్రీవాల్ కోల్పోయారు. అయితే ఇప్పుడు తన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడితో రాజీనామా చేయించి ఆ స్థానంలో రాజ్యసభకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఆప్ పార్టీకి పంజాబ్ లో తిరుగులేని మెజార్టీ ఉంది. అక్కడ ప్రస్తుతం లూథియానా అసెంబ్లీ సెగ్మెంట్ కు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఆ స్థానానికి రాజ్యసభసభ్యుడిగా ఉన్న సంజీవయ్య అరోరా పేరును ఖరారు చేశారు. ఎమ్మెల్యే స్థానానికి ఎవరూ లేనట్లుగా రాజ్యసభ సభ్యుడిని ఖరారు చేయాల్సిన అవసరం లేదు. ఆ స్థానాన్ని ఖాళీ చేయించి రాజ్యసభ ఉపఎన్నిక తీసుకు రావడానికే ఈ ప్లాన్ చేశారు. ఆ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఓ జాతీయ పార్టీ. ఆ పార్టీ మొన్నటి వరకూ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది. ఇప్పుడు ఒక్క పంజాబ్ లో మాత్రమే అధికారంలో ఉంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ సాధించారు కానీ అక్కడ సీఎంగా చేస్తున్న భగవంత్ మాన్ తీరుపైనే అభ్యంతరాలు ఉన్నాయి. మరో రాష్ట్రంలో ఆప్ బలపడలేదు. హర్యనాలోనూ కనీస ఓట్లు సాధించలేకపోయింది.