అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం విషయంలో ఒకవైపు కాంగ్రెస్, భాజపా లురెండూ పరస్పరం కత్తులు దూసుకుంటూ ఉంటే మధ్యలో ఆ రెండు పార్టీల మధ్య రహస్య అవగాహన ఉన్నదంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొత్త వాదనతో తెరపైకి వస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య అవగాహన ఉన్నది గనుకనే నరేంద్రమోడీ నకిలీ డిగ్రీ గురించి కాంగ్రెస్ ప్రశ్నించడం లేదని, అదే సమయంలో సోనియాను అరెస్టు చేయడానికి మోడీ సర్కారు చర్యలు తీసుకోవడం లేదని కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఒకవైపు అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం సభలోనూ చర్చకు వస్తుండగా.. కేజ్రీవాల్ మాత్రం ఇప్పటిదాకా అగస్టా దర్యాప్తు అంగుళం కూడా ముందుకు సాగలేదని దెప్పిపొడుస్తుండడం విశేషం. ‘సోనియాను అరెస్టు చేసి రెండు రోజులు ప్రశ్నిస్తే చాలు.. మొత్తం నిజాలు వాటంతట అవే బయటకు వస్తాయి’ అంటూ కేజ్రీవాల్ మోడీ సర్కారుకు మార్గదర్శనం చేస్తున్నారు.
అయినా కేజ్రీవాల్ ఏదో తన ధోరణిలో తాను విమర్శలు గుప్పిస్తున్నట్లుగానే కనిపిస్తోంది గానీ.. అగస్టా హెలికాప్టర్ల స్థాయి భారీ కుంభకోణానికి , నరేంద్రమోడీ నకిలీ డిగ్రీ ఆరోపణలు సరితూగుతాయా? కేవలం ఆయన డిగ్రీ గురించి కాంగ్రెస్ మాట్లాడకుండా ఉంటున్నందుకు అగస్టా వ్యవహారాన్ని భాజపా పక్కన పెట్టేస్తుందా? ఆరెండు కుంభకోణాల స్థాయి ఒకటేనా అని పలువురు భావిస్తున్నారు. మోడీ డిగ్రీ వ్యవహారం అనేది తాను లేవనెత్తిన అంశం గనుక.. దాని స్థాయి పెంచి రాద్ధాంతం చేయడానికి.. అది చాలా పెద్ద వ్యవహారం అన్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికి కేజ్రీవాల్, దానిని అగస్టాతో పోలుస్తున్నారేమో అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.