లండన్ లో మేడం టుస్సాడ్ మ్యూజియం గురించి ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆ మైనపు బొమ్మల మ్యూజియంలో ప్రపంచంలోని ప్రముఖుల మైనపు బొమ్మలు ఏర్పాటు చేస్తారు కనుక అందులో తమ మైనపు బొమ్మ కలిగి ఉండటం చాలా గౌరవంగా అందరూ భావిస్తారు. ఆ మ్యూజియంలో భారత్ కి సంబంధించి జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్, మాధురి దీక్షిత్, హృతిక్ రోషణ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ల మైనపు విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పుడు వారి విగ్రహాల సరసన డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు.
ఈమేడం టుస్సాడ్ మ్యూజియంలో నానాటికీ విగ్రహాల సంఖ్య పెరిగిపోతోంది కనుక లండన్ తో బాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో కూడా శాఖలు ఏర్పాటు చేయబడ్డాయి. కనుక డిల్లీలో ఏర్పాటు చేయబోయే మ్యూజియంలో మొట్టమొదటగా అరవింద్ కేజ్రీవాల్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్లుగా భారత్ లో ఆ సంస్థ ప్రతినిధిగా ఉన్న విజ్ క్రాఫ్ట్స్ ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ఒక లేఖ ద్వారా తెలియజేసింది. వచ్చే ఏడాదికల్లా ఈ మ్యూజియం సిద్దమవుతుందని ఆ సంస్థ తెలియజేసింది.
దానిలో ప్రధాని నరేంద్ర మోడి, సోనియా గాంధీ, రాహుల్ గాంధిలకు ప్రాధాన్యం ఈయకుండా అందరి కంటే ముందుగా అరవింద్ కేజ్రీవాల్ విగ్రహం ఏర్పాటు చేయాలనుకోవడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ, అది కేజ్రీవాల్ కి దక్కిన అపూర్వమయిన గౌరవమని చెప్పవచ్చును.
భారత్ లో మ్యూజియం పెడుతున్నారు కనుక మున్ముందు చంద్రబాబు నాయుడు, కేసీఆర్, నితీష్ కుమార్, జగన్మోహన్ రెడ్డి, కవిత, బొత్స సత్యనారాయణ, లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత వంటివారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తారేమో చూడాలి. లేకుంటే సంబంధిత వర్గాల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.