వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక కూటమి కడతాయనీ, భాజపాని ఓడించాలనే కామన్ అజెండాతో పనిచేయాలనే ఒక ప్రయత్నం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుందా, లేదంటే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తే.. రాహుల్ గాంధీ మద్దతు ఇస్తారా అనే స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే, కేసీఆర్ ఫెడరల్ ఫ్రెంట్ ప్రయత్నాలు అటకెక్కినట్టే..! ఆయన భాజపాకి మరింత చురువౌతూ ఫెడరల్ కల పక్కనపెడుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇంకోపక్క, రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికలకు వచ్చేసరికి.. ప్రతిపక్షాలను ఐక్యం చేయడంలో రాహుల్ గాంధీ విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయం అవుతోంది..!
తాను ప్రతిపక్ష పార్టీలతో కలిసి కదిలేది లేదనీ, స్వతంత్రంగానే ఎన్నికను ఎదుర్కొంటామంటూ కేజ్రీవాల్ అన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమికి ఆప్ దూరంగా ఉంటుందని ప్రకటించారు. అంతేకాదు, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్వతంత్రంగానే పోటీ చేస్తామనీ, ఇకపై రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టుగా కేజ్రీవాల్ చెప్పారు. ఉన్నట్టుండి ఆయన ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే… రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, కాంగ్రెస్ పై ఆగ్రహం! రాజ్యసభ డెప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా మద్దతు ఇవ్వాలంటూ రాహుల్ గాంధీగానీ, ఇతర యూపీయే నేతలెవ్వరూగానీ తనకు ఫోన్ చెయ్యలేదనేది కేజ్రీవాల్ ఆగ్రహం. కాబట్టి, ఇలాంటి పార్టీలను నమ్ముకుని భాజపాపై పోరాటానికి తాను సిద్ధపడటం సరైందని కాదని అనుకుని ఉంటారు.
ఇక, రెండోది… జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు కేజ్రీవాల్ కి ఉన్నాయని చెప్పుకోవచ్చు! ఇంకా చెప్పాలంటే, ఆయనకి ప్రధాని కావాలనే కోరిక కూడా ఉందని ఆప్ వర్గాలు అంటుంటాయి! ఆ వ్యూహంతోనే జాతీయ స్థాయిలో కీలకం కావొచ్చనే లక్ష్యంతోనే ఫెడరల్ ఫ్రెంట్ అంటే మద్దతు ప్రకటించారు, ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు, తమిళనాడు కూడా వెళ్లారు. అయితే, ప్రతిపక్షాల కూటమి విషయంలో మమతా బెనర్జీ లీడ్ తీసుకుంటూ ఉండటం, నాయకత్వం వహించాల్సిన కాంగ్రెస్ పార్టీ వెనక వరుసలోకి వెళ్లిపోతూ ఉండటం, ఈ క్రమంలో తనకు ప్రాధాన్యత ఏముంటుందీ అనుకోవడం… ఇవన్నీ అంచనా వేసుకుని, వీళ్లతో కలిసి ఉండటం సరైన వ్యూహం కాదన్న నిర్ణయానికి కేజ్రీవాల్ వచ్చి ఉంటారు! ఏదేమైనా, ఇది పరోక్షంగా భాజపాకి అనుకూలించే అంశమే అవుతుంది కదా!