శుక్రవారమే బెయిల్ పై విడుదల కావాల్సిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ పై తాజాగా హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కేజ్రీవాల్ బెయిల్ ను సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కింది కోర్టు ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఆయన తరఫు న్యాయవాదులు ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. గురువారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. లక్ష పూచీకత్తుతో కేజ్రీవాల్ ను విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై తాము హైకోర్టులో అప్పీల్ కు వెళ్తామని… ఈ తీర్పుపై 48గంటలపాటు స్టే విధించాలని ఈడీ కోరినా అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. దీంతో ఆయన శుక్రవారం విడుదల అవుతారని ఆప్ శ్రేణులు భావించారు.
ఈ క్రమంలోనే కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ శుక్రవారం ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్ బెయిల్ ను వ్యతిరేకించేందుకు మాకు సరైన అవకాశం దక్కలేదు.. మా వాదనలను వినిపించేందుకు కోరిన విధంగా సమయం ఇవ్వలేదని ఈడీ తరఫు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ట్రయల్ కోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ, తమ పిటిషన్ పై చర్యలు చేపట్టాని అభ్యర్థించారు.
దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ట్రయల్ కోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధిస్తు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ విడుదలకు బ్రేక్ పడటం ఆప్ శ్రేణులను బాధించింది.