ఇంత బతుకు బతికీ జైలుకెళ్లడం ఎలా అని సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ మథనపడుతున్నారు. ఆయనే ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో నిధులు విదేశీ కంపెనీకి బదిలీ చేశారు. ప్రభుత్వం మారిన వెంటనే ఆయన నిర్మోహమాటంగా తన తప్పేం లేదని అంతా కేటీఆర్ చేయమంటేనే చేశానని ఓ నివేదిక ఇచ్చేశారు కూడా. ఇప్పుడు ఆయన తనను నిందితుడిగా కాకుండా అప్రూవర్‌గా మార్చుకున్నా ఇబ్బంది లేదని కానీ అరెస్టు మాత్రం వద్దని అంటున్నారు.
అర్వింద్ కుమార్ అధికారి మాత్రమే. ఆయన రూల్స్ పాటించలేదు. కానీ అసలు ఈ వ్యవహారం మొత్తం నడిపింది కేటీఆర్ కాబట్టి ఆయనకే క్రెడిట్ ఇవ్వాలని తన పాత్ర ఆదేశాలు పాటించడమేనని అంటున్నారు. మౌఖిక ఆదేశాలు పాటించడం వల్లే సమస్య వచ్చిందంటున్నారు. కేటీఆర్ కూడా తానే ఆదేశించానని చెబుతున్నారు. దీన్ని ఏసీబీ అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అర్వింద్ కుమార్ ఇప్పటికే తప్పు జరిగిందని.. కానీ ఆ తప్పులకు తానుబాధ్యుడిని కాదని చెబుతున్నారు. అందుకే కేటీఆర్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. అర్వింద్ కుమార్ అసలేం జరిగిందో అప్రూవర్ గా మారితే కేటీఆర్ బయటపడటం కష్టమవుతుంది. అరవింద్ కుమార్ అలా చేయరని కేటీఆర్ సన్నిహితులు నమ్మకంతో ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన కీలక పొజిషన్లలో ఉన్నారు. కానీ వారు చేసిన తప్పులకు తాను ఎందుకు బలి కావాలని అర్వింద్ కుమార్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.