హోదా కథ ముగిసింది, ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని ఒకటే పాట పాడుతున్నారు బిజెపి, టిడిపి నాయకులు. తాజాగా ప్రత్యేక హోదాకు మంగళం పాడడానికి బిజెపి, టిడిపి నాయకులు అడ్డుపెట్టుకున్న నీతి అయోగ్ ఉపాధ్యక్షడు అరవింద్ పనగరియా కూడా అవే మాటలు వినిపించాడు. ప్యాకేజ్ రూపంలో హోదా కంటే కూడా ఎక్కువ ప్రయోజనాలు కల్పిస్తున్నాం లాంటి నాయకులందరూ చెప్పే మాటలనే మరోసారి చెప్పుకొచ్చాడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కథ ముగిసిపోయింది అని అనడం మాత్రం బాగాలేదు. పనగరియా అనే కాదు టిడిపి నేతలు, బిజెపి నేతలు కూడా ప్రత్యేక హోదా కథ ముగిసిపోయింది అని అనడం కంటే కూడా ముగించాం అంటే కరెక్ట్‌గా ఉంటుంది.
ప్రత్యేక హోదా ఇస్తాం అనే కాంగ్రెస్ వాళ్ళు మాటల్లో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉత్త మాటలే చెప్పింది……బాబు-మోడీ జోడీని గెలిపిస్తే మేం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాని మేం ఇచ్చి చూపిస్తాం అని బిజెపి-టిడిపి నాయకులు చెప్పారు. ఆ తర్వాత కారణాలేవైనా రెండు పార్టీల వారూ కూడా హోదాకి మంగళం పాడేసి ప్యాకేజ్ పాట ఎత్తుకున్నారు. ఇక్కడ ప్రత్యేక హోదా కథ దానంతట అదే ముగిసిపోలేదు కదా. అలాంటప్పుడు హోదా కథ ముగిసిపోయింది, ముగిసిన అధ్యాయం అని ఎలా చెప్తారు. ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్ధేశ్యం లేదనో, లేకపోతే హోదా ఇవ్వకపోయినా సీమాంధ్ర ఓటర్లు కచ్చితంగా మా వెనుకే ఉంటారు, ఇస్తే మిగతా రాష్ట్రాల ఓటర్లు మాకు వ్యతిరేకులవుతారనో…లేక వేరే ఏదో కారణం చూపించో హోదా కథను మేమే ముగించేశాం అని చెప్తే నిజాయితీగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబుతో పాటు జగన్ కూడా మోడీకి మిత్రుడైపోయాడు కాబట్టి ఇక అడిగేవాడు ఎవడూ లేడు. ఒకవేళ అడిగినా చంద్రబాబు, జగన్‌ల భజన మీడియా ఉండగా మోడీకి భయం ఏల? అడిగినవాళ్ళ వాయిస్ అస్సలు వినిపించకుండా చేయడంలో, పాలకుల భజన చేయడంలో భారతదేశంలో పేరెన్నికగన్న తెలుగు భజన మీడియా ఉన్నంత వరకూ మోడీకి వచ్చే నష్టం ఏమైనా ఉంటుందా?