ప్రతి మనిషి పుట్టుకకూ ఓ కారణం ఉంటుంది. తప్పకుండా పుట్టిన ప్రతిమనిషీ ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తాడు… ఈ నేపథ్యంలో ఆర్య హీరోగా తమిళంలో ఓ సినిమా తెరకెక్కింది. తెలుగులో `సామ్రాజ్యం` పేరుతో అనువాదమవుతోంది. ఈ సినిమాలో ఆర్యకు జోడీగా కీర్తి నటించారు. చరణ్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. నైనాల సాంబమూర్తి హైమావతి సమర్పిస్తున్నారు. వీవీయస్ క్రియేషన్స్ పతాకంపై తెలుగులోకి అనువాదమవుతోంది. నైనాల సాయిరామ్ అనువదిస్తున్నారు. రాజశ్రీ మణికంఠ సహ నిర్మాత. `సామ్రాజ్యం` నిర్మాత నైనాల సాయిరామ్ మాట్లాడుతూ “ఆర్య కెరీర్లో చేసిన తొలి మాస్ సినిమా ఇది. తమిళంలో మంచి హిట్ అయింది. తెలుగుకు పక్కాగా సరిపోయే సబ్జెక్ట్ ఇది. ప్రతి మనిషి పుట్టుకకు ఓ కారణం ఉంటుంది. అలాగే మా హీరో పుట్టుకకు కూడా కారణం ఉంది. తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం హీరో ఏం చేశాడు? ఎలా పోరాడాడు? ఎవరితో ఎలా తలపడ్డాడు? అనేది ఆసక్తికరమైన కథ. అనువాద పనులు పూర్తయ్యాయి. ఐదు పాటలు, యాక్షన్ సీక్వెన్స్, కామెడీ సినిమాకు హైలైట్ అవుతాయి. త్వరలోనే పాటలను విడుదల చేస్తాం“ అని అన్నారు.
నాజర్, నెపోలియన్, అదిశయ అవినాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: భరద్వాజ్, పాటలు: శివగణేష్, బాలవర్ధన్, హరిదాస్ సింగటూరి, మాటలు: రాజశేఖర్ రెడ్డి, సహ నిర్మాత: రాజశ్రీ మణికంఠ, సమర్పణ: నైనాల సాంబమూర్తి హైమావతి, నిర్మాత: నైనాల సాయిరామ్.