షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన వ్యవహారంలో అనేక వివాదాస్పద అంశాలు బయటకు వస్తున్నాయి. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టేశారని చాలా పెద్ద ఆపరేషన్ చేశారని.. ఆ శాఖకు చెందిన అధికారులకు వీరతాళ్లు వేశారు కానీ చాలా పక్కా ప్రణాళిక ప్రకారం వేసిన ట్రాప్ అని ఒక్కొక్కటిగా ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన తర్వాత కొంత మంది ఆయనతో సెల్ఫీలు దిగారు. వీడియోల్లోనూ మరికొంత మంది కనిపించారు. అసలు వీరెవరు అన్నదానిపై సోషల్ మీడియా ఆరా తీసింది. చివరికి వారిలో ఒకరు బీజేపీ నేత కాగా.. మరొకరు ఇండిపెండెంట్ డిటెక్టివ్‌గా ప్రచారం చేసుకునే మరో వ్యక్తి ఉన్నట్లుగా తేలింది.
అసలు ఎన్సీబీ ఆపరేషన్లోకి వాళ్లెందుకు వచ్చారన్న దుమారం రేగడంతో వారు సాక్షులని.,. ఎన్సీబీ అధికారులు చెప్పడం ప్రారంభించారు. అంటే సాక్షుల్ని తీసుకుని మరీ వెళ్లి అరెస్ట్ చేశారన్నమాట. సాధారణంగా సంఘన జరిగినప్పుడు అక్కడ ఉన్న వారినే సాక్షులుగా తీసుకుంటారు. కానీ ఆర్యన్ కేసులో మాత్రం భిన్నంగా సాగుతోంది. ఇంకా విశేషం ఏమిటంటే సాక్షుల్లో ఒకరుగా ఉన్న బీజేపీ నేత ముంద్రా పోర్టులో డ్రగ్స్ దొరికినప్పుడు గుజరాత్లో ఉన్నారట. మొత్తానికి ఆర్యన్ కేసు వ్యవహారం లో అంతా క్లియర్‌గా లేదని.. చాలా చాలా తెలియని అంశాలు ఉన్నాయన్న అభిప్రాయం మాత్రం బలంగా బయటకు వస్తోంది.
అదే సమయంలో ఆర్యన్ విషయంలో అనేకానేక ప్రచారాలను ఎన్సీబీ కస్టడీలో చెబుతున్నట్లుగా బయట చేస్తున్నారు. ఆర్యన్ ఫోన్లో వ్యక్తిగత వివరాలు.. ఇతరఅంశాలనూ మీడియాకు లీక్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆర్యన్ కేసు వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని మహారాష్ట్ర సర్కార్ మంత్రులు ఆరోపిస్తున్నారు. అదేంటో తేలాల్సి ఉందన్న అభిప్రాయం సోషల్ మీడియాలోనూ వ్యక్తమవుతోంది.