అధికార అహంకరామో.. ఏం చేసినా తమకే ఓట్లు వేస్తారన్న అతి విశ్వాసమో కానీ ఏపీ ప్రభుత్వ పెద్దలు వేస్తున్న కొన్ని అడుగులు .. చేస్తున్న చేష్టలు.. తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం కొన్ని వర్గాలను తీవ్రంగా కలచి వేస్తున్నాయి. ఓ కులంపై ద్వేషంతో ఇప్పటి వరకూ మద్దతిచ్చినా … ఎందుకిన్ని అవమానాలకు గురి కావాల్సి వస్తోందన్న ఆవేదన వారిని చుట్టు ముడుతోంది. ఆర్యవైశ్యులు అందరూ పెద్దయనగా భావించిన కొణిజేటి రోశయ్య చనిపోతే… ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన గౌరవం.. ఏపీకి చెందిన నిలువెత్తు గౌరవానికి ప్రభుత్వ పెద్ద కనీసం సంతాపం తెలియచేయలేదు. వ్యక్తిగతంగా కాకపోయినా ప్రభుత్వ పెద్ద హోదాలో అయినా వెళ్లి రోశయ్యకు గౌరవం ఇస్తారేమో అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.
గతంలో ఆయన సీఎంగా ఉన్పన్పుడు ఏం జరిగిందో.. సీఎం కుర్చీ నుంచి దిగిపోయే వరకూ ఏం చేశారో.. ఇప్పుడు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో సుబ్బారావు గుప్తా వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆయన నిఖార్సైన వైసీపీ నేత. ఆ విషయం ఒంగోలులో అందరికీ తెలుసు. అయితే నీతినిజాయితీగా వ్యాపారం చేసుకుంటూ… దందాలకు దూరంగా ఉంటూ… సిన్సియర్‌గా పార్టీ కోసం పని చేస్తున్నారు. ఆర్థికంగా బలవంతుడు కాదు.. ఎదుటి వారిని కొట్టే మనస్థత్వం కూడా కాదు. ఆయినా సొంత పార్టీ వాడని కూడాచూడకుండా కొట్టించడం.. చాలా మంది ఆర్యవైశ్యల్ని నిశ్చేష్టుల్ని చేసింది. ఎక్కడా గౌరవానికి తగ్గకుండా బతికే సామాజికవర్గం ఆర్యవైశ్యులు. ఇలాంటి వారిని ఇంత ఘోరంగా అవమానించడం.. వైసీపీలోని ఆర్యవైశ్య నేతలకూ రుచించడం లేదు.
కానీ వారు నోరు తెరవడం లేదు. పార్టీలతో సంబంధం లేని ఆర్యవైశ్య నేతలు మాత్రం.. తమ వాదన వినిపించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వరుసగా వ్యవహరిస్తున్న తీరు ఆర్యవైశ్యుల్ని కలచి వేసిందన్నది నిజం. వారు ఇప్పటి వరకూ వైసీపీకిమద్దతుగా ఉన్నారన్నది కూడా నిజం. ఇప్పుడు వారి మద్దతు కోల్పోతే.. వైసీపీకి జరిగే నష్టం ఏమిటో కూడా వైసీపీకి తెలుసు., అయినా ఎందుకిలా వ్యవహరిస్తున్నారు..? వారంతా వ్యాపారవర్గాలు కాబట్టి త మగుప్పిట్లోనే ఉండాలంటే ఏంచేయాలో తెలుసు కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఇలా వ్యవహరిస్తున్నారా.. అన్న సందేహాలు ఆ వర్గంలో ఏర్పడుతున్నాయి.