మిస్టర్ చంద్రుడూ.. ఏపీకి వస్తా… నీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా… మిత్రుడు జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెబుతానంటూ.. కొద్ది రోజుల కిందట… నాటకీయంగా ఓ అర్థరాత్రి సమావేశంలో ప్రకటించిన మజ్లిస్ నేత అసదుద్దీన్ ఇప్పుడు.. జగన్ కోరితేనే ఏపీకి వస్తానంటూ… మాట మార్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. మజ్లిస్‌కు వ్యతిరేకంగా బలమైన అభ్యర్థిని నిలబెట్టి… గట్టిగా ప్రచారం చేసినందుకు.. ఓవైసీపీపై చంద్రబాబు ఆరోపణలు చేసినందుకు.. ఈ ప్రతీకారం తీర్చుకుంటానని.. ఆయన చెప్పుకొచ్చారు. ఈ సారి పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో అదే అర్థరాత్రి మాట్లాడుతూ.. జగన్ కోరితే ఏపీకి వెళ్లి ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున గతంలో… ఎమ్మెల్యే మేకపాటి గౌతం రెడ్డి… ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఆ విషయం బయటకు వచ్చింది.
అయినప్పటికీ.. ఓవైపు జగన్ నుంచి ఆహ్వానం రాలేదని… వస్తే వెళ్తానని ఎందుకంటున్నారో.. ఏపీ రాజకీయవర్గాలకు సులువుగానే అర్థమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు…ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగా టీఆర్ఎస్తో టీఆర్ఎస్కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఓవైసీతోనూ దగ్గర సంబంధాలు నిర్వహిస్తున్నారు. నిజానికి ఈ పార్టీలన్నీ కలిసి బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఈ విషయం బహిరంగంగా ప్రజలకు స్పష్టమయిపోయింది. ఇప్పుడు అందరూ కలిసి.. ఏపీలో ప్రచారం చేస్తే.. బీజేపీ కోసం… ఇంత మంది వస్తున్నారన్న వ్యతిరేకత బయటపడుతుందని జగన్ భయపడుతున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో.. ఓవైసీ రాక వల్ల.. ఏపీలో ముస్లిం ఓట్లు వస్తాయో రావో కానీ.. ఓవైసీనే ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కయ్యారనే బలమైన నమ్మకం… ముస్లింలలో ఏర్పడుతుంది. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బ తీసి.. బీజేపీని మళ్లీ అధికారంలోకి వచ్చేలా చేయడానికి ఎక్కడికక్కడ ముస్లిం ఓట్లను చీల్చడానికి ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి.. అటు కేసీఆర్‌ను కానీ.. ఇటు ఓవైసీని కానీ ఎపీకి వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే… ఏపీకి వస్తా.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానంటూ… సవాల్ చేసిన ఓవైసీ ఇప్పుడు జగన్ పిలిస్తే వస్తానంటూ కవర్ చేసుకుంటున్నారు.