హైదరాబాద్: ముంబై పేలుళ్ళకేసులో దోషి యాకూబ్ మెమెన్‌కు ఉరిశిక్ష విధించటంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యల వివాదం ముదురుతోంది. ముస్లిమ్ కాబట్టే యాకూబ్‌ను ఉరి తీస్తున్నారని అసద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మండిపడ్డారు. తీవ్రవాదికి ఉరిని రాజకీయం చేయాలనుకుంటున్న ఓవైసీ, కావాలంటే పాకిస్తాన్ వెళ్ళొచ్చని, తలుపులు తెరిచే ఉన్నాయని వ్యాఖ్యానించారు. 250మంది భారతీయులను పొట్టన పెట్టుకున్న మెమెన్‌ను ఉరితీయమని సుప్రీంకోర్టు పేర్కొంటే ఓవైసీ వ్యతిరేకించటమేమిటని అన్నారు.
అసద్ నిన్న ఒక ఇంటర్వ్యూలో యాకూబ్ అంశంపై మాట్లాడుతూ, కేవలం ముస్లిమ్ కాబట్టే అతనిని ఉరితీస్తున్నారని, అతని పిటిషన్‌ను పరిశీలించకుండా ఎలా ఉరి తీస్తారని అసద్ వ్యాఖ్యానించారు. రాజీవ్ గాంధి, బియాంత్ సింగ్ హంతకులకు తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలలో రాజకీయనేతల అండ ఉందని, అందుకే వారు యావజ్జీవశిక్షతో బయటపడ్డారని గుర్తు చేశారు. కానీ ముస్లిమ్ మతస్థుడైన యాకూబ్‌ను ఆదుకునేవారే కరువయ్యారని వాపోయారు. నేరస్తులను ఉరితీయాలనుకుంటే మతాన్ని ఆధారంగా చేసుకుని మరణశిక్షలు విధించొద్దని కోరారు. ఒక మతాన్ని టార్గెట్ చేయటం సమంజసంకాదని అన్నారు.