హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో విజయంపై ఎంఐఎం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక్కడ కేవలం 46.08శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో మజ్లిస్ కంచుకోటలో బీజేపీ పాగా వేస్తుందా..? అనే చర్చ జరుగుతోంది.
ఈ తక్కువ పోలింగ్ పర్సంటేజ్ తో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత గట్టేక్కినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హిందువుల ఓట్లు గంపగుత్తగా ఎలాగూ బీజేపీ ఖాతాలోకి వెళ్తాయని, ముస్లింల ఓట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ , ఎంఐఎంకు వెళ్ళడంతో ఓట్ల చీలికతో బీజేపీ పాతబస్తీలో జెండా ఎగరేస్తుందా..? అని చర్చ ప్రారంభమైంది.
హిందూ ఓటింగ్ అధికంగా ఉండే గోషామహల్ లో 49శాతం , కార్వాన్ లో 51శాతం పోలింగ్ నమోదైంది. ఈ ప్రాంతంలోని మెజార్టీ ఓట్లు బీజేపీకే పడతాయనేది ఓపెన్ సీక్రెట్. ఇక, అసదుద్దీన్ కు పట్టున్న మలక్ పేట్ లో 38శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో ఎంఐఎం నేతలు ఆందోళన చెందుతున్నారు.
చాంద్రాయణ గుట్టలో 49.19%, చార్మినార్ లో 48.53%, యాకత్ పురాలో 42.70% పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గాల్లో ఎలాగూ ఎంఐఎంకు మెజార్టీ వస్తుందని, దాంతో బీజేపీకి పట్టున్న నియోజకవర్గాల్లో ఆపార్టీకి మెజార్టీ వచ్చినా, స్వల్ప ఓట్ల మెజార్టీతోనైనా అసద్ గెలుస్తాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.