‘ఆంధ్రప్రదేశ్ కి వస్తున్నా చంద్రబాబు నాయడు… కాస్కో’ – సరిగ్గా ఓ పాతిక రోజుల కిందట, ఏపీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎం.ఐ.ఎం. అధినేత చేసిన సవాల్ ఇది. తాను ఏపీ పర్యటనకు వస్తాననీ, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేస్తానని అన్నారు. మిత్రుడు జగన్ కి తన మద్దతు ఉంటుందన్నారు. కడప, అనంతపురం, కర్నూలు లాంటి జిల్లాల్లో, ముస్లిం మైనారిటీ ఓటర్లను ఆయన ప్రభావితం చేస్తారని వైకాపా కూడా ఆశించింది. అయితే, ఇప్పుడు ఆయన ఏపీ పర్యటన ఊసే ఎత్తడం లేదు! ఆంధ్రా రాజకీయాల్లో వేలుపెడతానన్న కేసీఆర్ మాదిరిగానే, అసదుద్దీన్ కూడా మనసు మార్చుకున్నట్టున్నారు! నేరుగా ఆంధ్రాలో పర్యటిస్తే, తన మిత్రుడికి లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ అనే స్పష్టతకు వచ్చినట్టున్నారు. అందుకే, హైదరాబాద్ లో ఉంటూనే వైకాపాకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు అసదుద్దీన్ ఒవైసీ.
ఆంధ్రాకి వెళ్లకుండానే ప్రచారం ఎలా అంటే… వైకాపా సాయంతో ఏపీ నుంచి కొంతమంది ముస్లిం కీలక నేతల్ని తన దగ్గరకి అసదుద్దీన్ పిలిపించుకుంటున్నట్టు సమాచారం! వారితో తరచూ భేటీలు అవుతున్నారట. మైనారిటీలకు మూడు శాతం రిజర్వేషన్లు కల్పించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి రుణం తీర్చుకోవాలంటే, జగన్ కి మద్దతు ఇవ్వాలంటూ ఏపీ ముస్లిం నేతలకు అసద్ చెబుతున్నట్టు తెలుస్తోంది. ప్రాంతాలవారీగా ముస్లిం నేతలను ఎంపిక చేసి, వారిని హైదరాబాద్ కి వైకాపా నాయకులే తీసుకుని వస్తున్నారట! రాయలసీమ, కోస్తా జిల్లాలకు చెందిన ముస్లిం నేతలతో అసద్ భేటీలు పూర్తయినట్టు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వచ్చేయడంతో… ఇప్పుడు ఈ భేటీలను మరింత వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. తనను నేరుగా కలవడానికి రాలేకపోతున్న నేతలతో అసదుద్దీన్ ఫోన్లలో మాట్లాడుతున్నారట. ఆంధ్రాలో ముస్లింలు జగన్ కి అనుకూలంగా ఓటెయ్యాలని చెబుతున్నట్టు వైకాపా వర్గాలే చెబుతున్నాయి.
నిజానికి, ఏపీలో మూడు లేదా నాలుగు సభలు అసదుద్దీన్ తో ఏర్పాటు చేయాలని వైకాపా నేతలు ఈ మధ్య అనుకున్నాట. కానీ, తాను వస్తే తెలంగాణ ముద్ర వేస్తారనీ, అది వైకాపాకి మైనస్ అవుతుందని ఆయనే చెప్పి… ప్రత్యామ్నాయంగా ఇలాంటి ప్రచారానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. మిత్రుడికి సాయం చేద్దామన్న ఆతృతలో ఏపీకి వస్తున్నా కాస్కో అని సవాల్ చేశారు అసద్. వాస్తవం ఇప్పుడు బోధపడుతోంది. ఏపీకి రాజకీయాల్లో వైకాపా ద్వారా జోక్యానికి సిద్ధమైన కేసీఆర్ గానీ, అసద్ గానీ కాస్త వెనక్కి తగ్గుతున్నారంటే… వాస్తవం ఏంటనేది వారికి బోధపడిందనేది అర్థమౌతూనే ఉంది. ఇంకోటి… కేవలం టీడీపీ మీద రాజకీయ కక్ష సాధింపు కోసమే వీరంతా సిద్ధపడ్డారే తప్ప, ప్రజాప్రయోజన కోణం అనేది వారి ఆలోచనల్లో లేదనేది కూడా స్పష్టమౌతోంది