హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే అందులో పాతబస్తీ ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారడం చాలా బాధ కలిగిస్తుంది. ఇటీవల ఎన్.ఐ.ఏ., నగర పోలీసులు కలిసి పాతబస్తీ పరిసర ప్రాంతాలలో 11మందిని అరెస్ట్ చేసి వారివద్ద నుండి బారీగా ప్రేలుడు పదార్ధాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నారు. ఈ శని,ఆదివారాలలో వారు జంటనగరాలలో రద్దీగా ఉండే పలు ప్రాంతాలలో ప్రేలుళ్ళకి ప్రణాళిక సిద్ధం చేసుకొన్నట్లు కనుగొన్నారు. ఒకవేళ ఎన్.ఐ.ఏ. అధికారులు సకాలంలో వారి ఆచూకి కనిపెట్టి పట్టుకోలేకపోయుంటే ఏమయ్యేదో ఆలోచిస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ పరిణామాలపై స్పందిస్తూ, “ఐసిస్ ఉగ్రవాద సంస్థని సమూలంగా తుడిచిపెట్టవలసిందే. ఇస్లాం మతానికి విరుద్దంగా ఐసిస్ వ్యవహరిస్తోంది. దానిని ఎవరూ సమర్ధించలేరు. మా పార్టీ కూడా దానిని, దాని ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సైనికచర్య జరిపి ఐసిస్ ని భౌతికంగా తుడిచిపెట్టేయవచ్చు. కానీ దానితో బాటు దాని భావజాలాన్ని కూడా తుడిచిపెట్టేందుకు కృషి చేయవలసి ఉంటుంది. అప్పుడే ఉగ్రవాద నిర్మూలన సాధ్యం అవుతుంది. అందుకే సిరియాకి చెందిన మహమ్మద్ అబుల్ హుదా ప్రముఖ మేధావిని హైదరాబాద్ కి ఆహ్వానించి ఆయన చేత యువతకి ఉపన్యాసాలు ఇప్పించాలనుకొంటున్నాము,” అని చెప్పారు.
ఎన్నికల సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసే అసదుద్దీన్ ఈవిధంగా మాట్లాడటం చాలా అభినందించవలసిన విషయమే. మజ్లీస్ పార్టీకి పాతబస్తీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలపై మంచి పట్టుంది కనుక, ఆయనే స్వయంగా చొరవ తీసుకొని తన పార్టీ నేతలు, కార్యకర్తల సహాయంతో ముస్లిం యువత ఉగ్రవాదంవైపు మళ్ళకుండా నివారించే ప్రయత్నాలు చేయాలి. అవసరమైతే ప్రభుత్వ, పోలీసుల సహాయసహకారాలు కూడా కోరడం మంచిది. లేకుంటే ముస్లిం యువకులే కాదు వారి కుటుంబాల జీవితాలు కూడా చిద్రం అవుతాయి. మోన్న పట్టుబడినవారు ఒకవేళ నగరంలో ప్రేలుళ్ళు జరపడంలో సఫలం అయ్యుంటే అనేక వందలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయుండేవారు. వారిపై ఆధారపడిన వారు రోడ్డునపడి ఉండేవారు. కనుక అసదుద్దీన్ ఓవైసీ ఐసిస్ ఉగ్రవాదాన్ని మాటలతో ఖండించడంతో సరిపెట్టకుండా బాధ్యతగల భారతీయ పౌరుడిగా, ప్రజా ప్రతినిధిగా దాని భావజాలానికి ముస్లిం యువత ఆకర్షితులు కాకుండా ఉండేందుకు తన బాధ్యత తను నిర్వర్తించడం చాలా అవసరం. ఐసిస్ ఉగ్రవాదులను నాశనం చేసేపని ప్రభుత్వాలు చూసుకొంటాయి.