మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నేరుగా.. తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటు వేయాలని ముస్లింలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ.. తెలంగాణలో కానీ మజ్లిస్ ఇంత వరకూ నేరుగా ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. కానీ అధికారంలో ఉన్న పార్టీతో మాత్రం.. సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీలు తమతో ఎంత సామరస్యంగా ఉంటాయన్నదానిపై.. ఆయా పార్టీలతో మజ్లిస్ వ్యవహారశైలి ఆధారపడి ఉంటుంది. తమకు అనుకూలంగా ఉన్న పార్టీతో కూడా.. నేరుగా మజ్లిస్ ఎప్పుడూ పొత్తులు పెట్టుకోలేదు. లోపాయికారీ సాయం మాత్రం చేసేది. తను పొందేది. గతంలో కాంగ్రెస్ పార్టీతో ఇలాంటి లోపాయికారీ రాజకీయాలను చేసింది. వైఎస్ హాయాంలో మజ్లిస్.. ఓ రకంగా… విశ్వరూపం చూపించింది. వైఎస్ అండతో.. పాతబస్తీలో పూర్తి పట్టు సాధించింది. మజ్లిస్ తో పోటీ పడే.. ఎంబీటీని పూర్తిగా నిర్వీర్యం చేయగలిగారు.
అయితే కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో.. మజ్లిస్ ఎత్తులు పారలేదు. మజ్లిస్ నేతల కోరికల్ని.. కిరణ్.. ఏ మాత్రం ఖాతరు చేయలేదు. పైగా.. కొన్ని కేసుల్లో అసద్ తో పాటు.. అక్బరుద్దీన్ కూడా.. జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఇదంతా కిరణ్ కుమార్ రెడ్డి వల్లే అయిందని.. కాంగ్రెస్ హైకమాండ్ కూడా పట్టించుకోలేదన్న ఉద్దేశంతో.. పూర్తిగా కాంగ్రెస్ కు వ్యతిరేకమయ్యారు. 2014 ఎన్నికల్లో గ్రేటర్ లో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న అన్ని స్థానాల్లోనూ పోటీ చేశారు. ఫలితంగా.. ముస్లిం ఓటు బ్యాంక్ మొత్తం… మజ్లిస్ కు పోవడంతో కాంగ్రెస్ పార్టీ.. చాలా నియోజకవర్గాల్లో మూడో స్థానానికి పరిమితమయింది. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో.. టీఆర్ఎస్ అధినేత.. మజ్లిస్ విషయంలో పూర్తి సానుకూలంగా వ్యవహరించారు. మజ్లిస్ తీసుకొచ్చిన ఏ ప్రతిపాదనను.. తిరగ్గొట్టలేదు. కాంగ్రెస్ హయాం నుంచి తమకు అప్పగించాలని కోరుకుటున్న ఓ ఆస్పత్రిని కేసీఆర్.. ఓవైసీ బ్రదర్స్ అడగగానే ఇచ్చేశారన్న ప్రచారం ఉంది. అందుకే… మజ్లిస్ ..కృతజ్ఞతగా టీఆర్ఎస్ కు లోపాయికారీ సాయం అందిస్తోందని తెలుస్తోంది. గతంలో గ్రేటర్ పరిధిలో ఎక్కడ ముస్లిం జనాభా ఉన్నా… ప్రతీ చోటా అభ్యర్థిని నిలిపేది. ఈ ఎన్నికల్లో మాత్రం సిట్టింగ్ స్థానాలతో పాటు.. గెలుపు అవకాశం ఉందని గట్టిగా నమ్ముతున్న రాజేంద్రనగర్ అసెంబ్లీ సీటులో మాత్రం పోటీ చేస్తోంది. అంటే.. మొత్తం ఎనిమిది సీట్లలోనే మజ్లిస్ పోటీ చేస్తోంది.
మజ్లిస్ ఎక్కడా పోటీ చేయకపోవడం..నేరుగా .. టీఆర్ఎస్ కు ఓటు వేయాలని అసదుద్దీన్ పిలుపునివ్వడంతో టీఆర్ఎస్ లో జోష్ నింపుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం.. అసదుద్దీన్ మాటలు.. పాతబస్తీలో వింటారేమో కానీ… ఇతర నియోజకవర్గాల్లో వినరని అంటున్నారు. అసద్ చెప్పినా.. బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న టీఆర్ఎస్ కు… ముస్లింలు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నిస్తున్నారు. మజ్లిస్ బరిలో ఉంటే.. మజ్లిస్ కు వేస్తారని.. లేకపోతే వారు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గుచూపుతారని.. విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ ఎన్నికల్లో ఇదే జరిగిందని లెక్కలు తీస్తున్నారు.