కొద్ది రోజుల క్రితం యూపీలో మజ్లిస్ పోటీ చేస్తుందని ప్రకటించి.. అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట్ల అసదుద్దీన్ ఓవైసీపీ ప్రకటించగానే రాజకీయంగా కలకలం రేగింది. ఆయన ముస్లిం ఓట్లను భారీగా చీల్చుతారని బీజేపీకి లాభం చేకూర్చుతారని అనుకున్నారు. అయితే రాను రాను అక్కడ మజ్లిస్ గురించి చర్చించుకోవడం మానేశారు. ఒకప్పుడు యూపీ ముస్లిం ఓటర్లు కాంగ్రెస్‌కు అండగా ఉండేవారు. ఇప్పుడు వారు సమాజ్ వాదీ పార్టీ వైపు మళ్లారు. ఈ క్రమంలో మజ్లిస్ పోటీ.. సమాజ్ వాదీ పార్టీ ఓట్లను చీలుస్తుందని అనుకున్నారు. అయన కూడా సమాజ్ వాదీ పార్టీని వదిలేసి ఇతర పార్టీలతో పొత్తుల కోసం ప్రయత్నించారు.
కానీ అందరూ సమాజ్ వాదీ పార్టీతో కలిసి.. ఒకటి.. రెండు చోట్ల అయినా పోటీ చేద్దామని అనుకుంటున్నారు కానీ… మజ్లిస్‌తో కలవాలని అనుకోలేదు. దీంతో మజ్లిస్ అధినేతకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మొదటి విడతకు ఎన్నికల షెడ్యూల్ వచ్చినా…అభ్యర్థుల్ని ఖరారు చేయలేకపోతున్నారు. ఇప్పటికీ పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు. కనీసం వంద స్థానాల్లో పోటీ చేస్తామని చెబుతున్నారు. కానీ ఆయన కనీసం ఓట్ల చీలిక పావుగా కూడా కాకుండా పోయారు.యూపీలో ముస్లిం జనాభా తక్కువేమీ కాదు.
చాలా చోట్ల డిసైడింగ్ ఫ్యాక్టర్. అయితే ఉత్తరాది ముస్లింలు.. మజ్లిస్‌ను ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. బీహార్‌తో పాటు పలు చోట్ల జరిగిన ఎన్నికల్లో అదే తేలింది. హైదరాబాద్ బయట ఒక్క మహారాష్ట్రలో మాత్రమే మజ్లిస్ ప్రభావం చూపింది. ఇతర చోట్ల.. ముస్లిం వర్గాల్లో పట్టు ఉన్న నేతలు ఎవరైనా మజ్లిస్‌లో చేరితే అక్కడ కాసిని ఓట్లు సంపాదించింది తప్ప… పట్టు సాధించలేకపోయింది.