తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ – ప్రజాకూటమి మధ్య పోరు.. హోరాహోరీగా మారుతోందన్న వాతావరణం బలపడుతున్న సమయంలో రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. టీఆర్ఎస్ ప్రకటిత మిత్రపక్షం.. మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైపీ… వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రకటనలు.. కాంగ్రెస్ కు దడ పుట్టించేలా లేవు.. నేరుగా టీఆ్ఎస్ కు షాకిచ్చేలా ఉన్నాయి. డిసెంబర్ పదకొండు తర్వాత తామే ముఖ్యమంత్రి ఎవరు కావాలో డిసైడ్ చేస్తామని బహిరంగంగా చెబుతున్నారు. ఒక వేళ అవసరం అయినా… కేసీఆర్ కు కచ్చితంగా మద్దతిస్తామని.. అక్బరుద్దీన్ చెప్పడం లేదు. ఇదే టీఆర్ఎస్ నేతల్ని ఆందోళనకు గురి చేస్తున్న అంశం. ఎన్నికల హడావుడి ప్రారంభం కాక ముందు అక్బరుద్దీన్ ఇలాంటి ప్రకటనే చేశారు. కర్ణాటక తరహాలో.. ఈ సారి తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఉండొచ్చని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా.. మజ్లిస్ నుంచి ముఖ్యమంత్రి రావొచ్చన్నట్లుగా ఆయన ప్రకటన ఉండటంతో కలకలం రేగింది.
అక్బరుద్దీన్ వ్యాఖ్యలను.. ఆయన సోదరుడు.. అసదుద్దీన్ అప్పటికి కవర్ చేశారు కానీ.. ఇప్పుడు మళ్లీ అక్బరుద్దీన్ అదే పాట వినిపిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో గ్యారంటీలేదు కానీ.. మజ్లిస్ కు మాత్రం ఏడు సీట్లు గ్యారంటీ అన్న పరిస్థితులు ఉన్నాయి. టీఆర్ఎస్ తో లోపాయికార ఒప్పందం చేసుకుని కేవలం ఎనిమిది సీట్లలోనే మజ్లిస్ పోటీ చేస్తోంది. సిట్టింగ్ ఏడు సీట్లు కాకుండా.. రాజేంద్రనగర్ లో పోటీ చేస్తోంది. అక్కడ టీఆర్ఎస్ తన సిట్టింగ్ .. ప్రకాష్ గౌడ్ ను.. లైట్ తీసుకుంటోంది. దీంతో ఆ సీటు కూడా.. ఎంఐఎం గెలుచుకోవాలని… అసదుద్దీన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎనిమిది సీట్లతో.. సీఎం పదవిలో ఎవరు ఉండాలనేది తామే నిర్ణయిస్తామని.. ఎవరైనా తమ వద్ద తల వంచాల్సిందేనన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు.
రాజకీయాల్లో ఉన్న ఓవైసీ బ్రదర్స్ లో అసదుద్దీన్ ఎంపీగా జాతీయ రాజకీయాల్ని చూసుకుంటున్నారు. అక్బరుద్దీన్ ఎమ్మెల్యేగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు. తెలంగాణ వ్యవహారాలను ఆయనే చూసుకుంటారు. చక్రం తిప్పే అవకాశం వస్తే.. అక్బరుద్దీన్ వదులుకునే అవకాశమే లేదు. అంది వస్తే.. సీఎం కుర్చీని కూడా పట్టేసుకోవాలనే తాపత్రయంలో ఆయన ఉన్నట్లు ఆయన మాటల ద్వారానే అర్థమైపోతుంది. ఇదే టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది. మజ్లిస్ తో అంట కాగుతూ తప్పు చేస్తున్నామా అన్న భావనలో పడిపోయారు.