తెలంగాణ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడానికి కేసీఆర్ ముహుర్తం ఖరారు చేశారన్న అభిప్రాయం ప్రగతిభవన్‌లో ఎక్కువగా వినిపిస్తూండే సరికి.. ఆశావాహుల ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. అయితే అన్నీ అంతర్గతంగానే జరుగుతున్నాయి. అది టీఆర్ఎస్ కాబట్టి…ఫలానా నేతకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ సాధారణంగా బయటకు వినిపించదు. ఒక్క నేతకు మాత్రం ఇందులో మినహాయింపు ఉంది. ఆ నేత… టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ కు మంత్రి పదవి ఇవ్వాలంటూ.. టీఆర్ఎస్ లో గళాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో.. ఎప్పుడూ లేని విధంగా… కొద్ది రోజుల కిందట.. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు .. కేటీఆర్ కు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ ను ఆయన సమక్షంలోనే చేశారు. ఆ తర్వాత ఆడపాదడపా…. ఆ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. పార్టీలో ప్రస్తుతం… పవర్ సెంటర్ గా ఉన్న కేటీఆర్ కాబట్టి.. ఆయన మెప్పు కోసం.. ఇలాంటి ప్రకటనలు చేసే వాళ్లు చాలా మంది ఉంటారు.
కానీ.. అనూహ్యం.. ఇతర పార్టీల నేతలు కూడా… కేటీఆర్ కు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్లు వినిపించడం ప్రారంభించారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైపీ కేటీఆర్ కు అనుకూలంగా ప్రకటన చేశారు. కేటీఆర్‌ను మళ్లీ మంత్రిగా చూసేందుకు ఎదురుచూస్తున్నామంటూ.. ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్ కూడా రిప్లయ్ ఇచ్చారు. ధన్యవాదాలు చెబుతూ రీ ట్వీట్ చేశారు. ఇప్పటికే.. కేబినెట్ లో … మార్పుచేర్పులంటూ..కొంత మంది పేర్లు విస్తృతంగా ప్రచారంలోకి వస్తుంది. ఓ సీనియర్ మంత్రిపై టీఆర్ఎస్ అనుకూల మీడియాలోనే వ్యతిరేక ప్రచారం జరుగుతూండటంతో… ఆయనకు ఊస్టింగ్ ఖాయమంటున్నారు. ఈ క్రమంలో…కేటీఆర్ విషయంలోనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అంటే ఆయనకు బెర్త్ ఖాయం.
అయితే. హరీష్ రావు విషయంలో.. ఏ ఒక్క నేత కూడా నోరు ఎత్తే ధైర్యం చేయలేకపోతున్నారు. ఆయనకు పదవి ఇవ్వాలని ఏ టీఆర్ఎస్ నేత కూడా డిమాండ్ చేయడం లేదు. అంటే.. ఇప్పటికైతే.. కేటీఆర్ కు ప్లస్ పాయింట్లు ఎక్కువగా ఉన్నాయని అనుకోవాలేమో..?