తెలంగాణలో హంగ్ వస్తే.. టీఆర్ఎస్ కు మద్దతిస్తానన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పకుండా.. కేసీఆర్ కు పూర్తి మెజార్టీ వస్తుందని.. చెప్పి తప్పించుకున్నారు మజ్లిస్ అధినేత అసదుద్దన్ ఓవైసీ. కేసీఆర్ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తారని.. తెలంగాణ ప్రజలంతా ఆయన వెంటే ఉన్నారని తమ మద్దతు అవసరం ఉండదని చెప్పుకొచ్చారు. తాము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ వెంటే ఉంటామన్నారు. హంగ్ ఏర్పడుతుందన్న ప్రచారం.. కాంగ్రెస్ నేతలతో.. అసదుద్దీన్ చర్చలు జరుపుతున్నారన్న పుకార్లు గుప్పుమనడంతో… అసదుద్దీన్ ..మధ్యాహ్నం కేసీఆర్ తో ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ తో సమావేశమయ్యారు. దాదాపుగా రెండు గంటల చర్చల తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కేసీఆర్ సీఎం అవుతారని… తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు ఒక విషయం చెప్పదల్చుకున్నానని …రేపు రాబోతున్న తీర్పు కేసీఆర్కు అనుకూలంగా ఉంటుందని ప్రకటించారు.
టీఆర్ఎస్ కు పూర్తి మెజార్టీ రావాలని అసదుద్దీన్ కోరుకుంటున్నారు. హంగ్ వస్తే.. కేసీఆర్ బీజేపీ మద్దతు తీసుకుంటారన్న ఆందోళన ఆయనలో కనిపించింది. మజ్లిస్ ను వదిలేస్తే.. మద్దతిస్తామని టీఆర్ఎస్ కు బీజేపీ ఇచ్చిన ఆఫర్ పైనా..పరోక్షంగా స్పందించారు. టీఆర్ఎస్ మద్దతు పలుకుతున్నారు కాబట్టి… రేపు హంగ్ వస్తే.. బీజేపీతో కలిసి టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తారా అన్న సందేహాలకు నేరుగానే సమాధానం ఇచ్చారు.
బీజేపీతో కలిసి టీఆర్ఎస్కు మద్దతిచ్చే అవకాశం ఉండదని తేల్చి చెప్పారు. బీజేపీకి ఇప్పుడున్న సీట్లు కూడా తగ్గిపోతాయని జోస్యం చెప్పారు. ఎంఐఎంకు ఎనిమిది సీట్లు వస్తాయన్నారు. తాను కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నానని వస్తున్న వార్తలను తోసి పుచ్చారు. ఎవరితో టచ్ లో ఉన్నానో చెప్పాలన్నారు.
హైదరాబాద్ తన నగరం…హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉందో నేనే చెప్పగలను ..ఇలాంటి వాతావరణం ఇక ముందుకూడా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ తో భేటీ కోసం అసదుద్దీన్ బైక్ మీద ప్రగతి భవన్ కు వచ్చారు.. హైదరాబాద్ ఎంతో ప్రశాంతంగా ఉందని చెప్పుకోవడానికి ఆయన ఇలా వచ్చారు. ఇదే మాటను మీడియాకు చెప్పారు. తను బైక్ మీద వచ్చానని.. ఎంత ప్రశాంతంగా హైదరాబాద్ ఉందో అంచనా వేసుకోవాలన్నారు.