సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ‘నా సామిరంగ’ ఒకటి. నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ మెరిసింది. తన స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకొంది. సీరియర్ హీరోలకు ఆషికా మంచి ఛాయిస్ అని.. అంతా అనుకొన్నారు. దానికి తగ్గట్టుగానే ఆషికాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా చిరంజీవి సినిమాలో తనకు ఛాన్స్ వచ్చినట్టు సమాచారం. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే తాను సెట్లో కూడా అడుగు పెట్టింది. త్రిషతో పాటుగా ఈ సినిమాలో మరికొంతమంది కథానాయికలకు చోటుంది. ఓ నాయికగా… మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్టు సమాచారం. మరో కీలకమైన పాత్ర కోసం ఆషికాని తీసుకొన్నార్ట. ఈ సినిమాలో చిరుకి ఐదుగురు అక్కాచెల్లెమ్మలు. అందులో ఓ పాత్ర ఆషికాకి దక్కిందని తెలుస్తోంది. త్వరలోనే ఆషికా ‘విశ్వంభర’ సెట్లో అడుగు పెట్టే ఛాన్సుంది. బహుశా.. చిరు చెల్లాయిగా ఆమె కనిపించొచ్చు. మిగిలిన నాలుగు పాత్రల్లోనూ పేరున్న కథానాయికలనే తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోంది. 2025 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీగా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.