ఇటీవలే ‘మెకానిక్ రాఖీ’గా పలకరించాడు విశ్వక్సేన్. ఆ సినిమా విశ్వక్‌ని నిరాశ పరిచింది. అయితే.. ఆ సినిమా ఫలితాన్ని పక్కన పెట్టి తన వర్క్‌లో తాను పడిపోయాడు. ప్రస్తుతం ‘లైలా’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు విశ్వక్. ఈలోగా కొత్త సినిమా కూడా మొదలైపోతోంది. విశ్వక్సేన్ కథానాయకుడిగా అనుదీప్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రానికి శ్రీకారం చుడుతోంది. రేపే ఈ చిత్రానికి కొబ్బరికాయ కొడుతున్నారు. ఈ చిత్రానికి ‘ఫంకీ’ అనే పేరు పెట్టారు.
కథానాయిగా ఆషికా రంగనాథ్ ని ఎంచుకొన్నారు. ఆషిక ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపోయింది. ‘నా సామిరంగ’లో నాగ్ సరసన నటించింది. చిరంజీవి `విశ్వంభర`లో తానే కథానాయికగా. ఇప్పుడు యంగ్ హీరోలతోనూ జట్టు కడుతోంది. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. సంక్రాంతి తరవాత రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ‘లైలా’లో విశ్వక్ లేడీ గెటప్‌లో దర్శనమివ్వబోతున్నాడు. ఆ గెటప్ కు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ ఎపిసోడ్ పూర్తయిన వెంటనే ‘ఫంకీ’ సెట్స్‌పైకి వెళ్లబోతోంది. నిజానికి ఈ కథ అనుదీప్ రవితేజతో చేయాల్సింది. చివరి క్షణాల్లో చేతులు మారింది.