ఢిల్లీలో తన పౌర విమానయాన శాఖ చూసుకుంటూ మధ్య మధ్య ఇష్మానుసారం ఏవో వ్యాఖ్యలు చేస్తూ కాలం గడుపుతున్న అశోక్ గజపతి రాజు ఇప్పుడు తమ పార్టీలో అసంతృప్తిని ఎదుర్కొంటున్నారట. అసలు ఆయనే అసంతృప్తితో వున్నారని బిజెపి గాలం వేస్తోందట. ఇది విజయనగరం జిల్లాలో నడుస్తున్న చర్చ. తనకు ప్రాధాన్యత నివ్వకపోయినా తనతో సంప్రదించకుండా జిల్లా పార్టీ అద్యక్షుడిని నియమించినా అశోక్ పట్టించుకోలేదంటే వేరే కారణాలున్నాయంటున్నారు.
కుమార్తె అదితిని పార్లమెంటుకు పంపించడం ఆయన ప్రధాన ఎజెండా వుంది తప్ప చిన్న చిన్న విషయాలు పట్టించుకోరంటున్నారు. ముఖ్యమంత్రి అధికార వేదికమీద అదితి కనిపించడం గురించి చంద్రబాబే ఆయనను హెచ్చరించడంతో బాగా ఇబ్బందిపడ్డారట. బొబ్బిలి రాజులను కేబినెట్లోకి తీసుకోవడం సుజయ కృష్ణరంగారావును మంత్రిని చేయడం అశోక్ జీర్ణించుకోలేదంటున్నారు. ఆఖరుకు తన విజయనగరం డివిజన్లోనూ మంత్రి గంటా శ్రీనివాసరావు పెత్తనమేమిటని అశోక్ గజపతి రాజు ఆగ్రహం. ఇదంతా చంద్రబాబు లోకేశ్లే చేయిస్తున్నారని ఆయన అనుకుంటే సీనియర్ననే పేరిట ఆయన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని వారు విసుక్కుంటున్నార. సందట్లో సడేమియాలా బిజెపి ఈ పరిస్తితుల్లో అశోక్ గజపతిని తమ పార్టీలోకి తీసుకోవాలని తహతహలాడుతున్నట్టు సమాచారం. ఆయనను ఏదో ఒక రాష్ట్ర గవర్నర్గా పంపిస్తే అప్పుడు కుమార్తె అదితిని ఎమ్మెల్యేను చేసి సరిపెట్టవచ్చునని వారి ఫార్ములా. ఇదంతా చాపకింద నీరులా నడుస్తున్నదని పరిశీలకులందరికీ తెలుసు. మరి ఈ లోగా చంద్రబాబు మరేదయినా మంత్రం వేస్తారా చూడాలి.