విజయనగరం జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు నాయకత్వానికి వ్యతిరేకంగా విజయనగరం లోని కొంత మంది టీడీపీ నేతలు వేరు కుంపటి పెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఈ వర్గానికి నాయకత్వం వహి్సతున్నారు. సాధారణంగా విజయనగరం జిల్లాలో టీడీపీకి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా.. అశోక్ గజపతిరాజు బంగ్లాలో జరుగుతుంది. టీడీపీ కార్యాలయం అశోక్ గజపతిరాజు బంగ్లాగానే నడిచిపోతుంది. అయితే.. అశోక్ వల్ల తమకు ప్రాధాన్యం దక్కడం లేదనుకున్న నేతలు.. అసంతృప్తికి గురయ్యారు.
వారంతా సొంత పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. మీసాల గీత పార్టీ కార్యాలయం ప్రారంభానికి కొంత మంది నేతలు హాజరయ్యారు.పార్టీకి సంబంధించిన ఏ సమాచారం మాకు అందండం లేదని.. జిల్లా కేంద్రంలో పార్టీ ఉనికి కోల్పోతున్నందు వల్లే కార్యాలయం ఏర్పాటు చేశామని మీసాల గీత ప్రకటించారు. అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 2014 ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు లోక్సభకు పోటీ చేస్తే.. విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి మీసాల గీత పోటీ చేశారు. ఇద్దరూ గెలిచారు. గత ఎన్నికల్లో మీసాల గీతకు బదులుగా అశోక్ గజపతిరాజు తన కుమార్తె అదితికి టిక్కెట్ ఇప్పించారు. అప్పట్నుంచి మీసాల గీత అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు.. సొంతంగా పార్టీ కార్యాలయన్ని ఏర్పాటు చేసుకున్నారు.
అశోక్ గజపతిరాజు తన రాజకీయ వారసురాలిగా కుమార్తె అదితి గజపతిరాజును రాజకీయాలకు పరిచయం చేశారు. ఆమెనే ప్రోత్సహిస్తున్నారు. ఈ కారణంగా తనకు రాజకీయ భవిష్యత్ ఉంటుందో లేదోననని మీసాల గీత కంగారు పడుతున్నారు. అశోక్ గజపతిరాజుకు ఆమె సహకరించకపోడంతో.. స్థానిక ఎన్నికల్లో ఆమె వైసీపీకి మద్దతుగా పని చేస్తున్నారని.. అశోక్ గజపతిరాజు ఆరోపిస్తున్నారు. కుట్రతోనే పార్టీని బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మాన్సాస్ వివాదంపై రాజకీయ పోరాటం చేసి ప్రజల మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్న అశోక్ గజపతిరాజుకు.. సొంత పార్టీలో పరిణామాలు ఇబ్బంది కరంగా మారాయి.