కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా విధులు నిర్వర్తిస్తున్న అప్పారావుకి ఆయుధాల వ్యాపారి సంజయ్ బండారీతో సంబంధాలున్నాయని, మంత్రి అశోక్ గజపతి రాజు కూడా బండారిని కలిసారని మీడియాలో ఆరోపణలు రావడంపై అశోక్ గజపతి రాజు ఈవిధంగా స్పందించారు. “సంజయ్ బండారీతో నా ఓ.ఎస్.డి.అప్పారావు 355సార్లు ఫోన్లో మాట్లాడినట్లు వచ్చిన ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపిస్తాను. నా క్రింద పనిచేసే అధికారులు తప్పు చేయరని నాకు నమ్మకం ఉంది. ఒకవేళ వాళ్ళెవరైనా తప్పు చేసి ఉంటే అందుకు నేను బాధ్యుడనే అవుతాను. సంజయ్ బండారి ఒకసారి నన్ను బెంగళూరు ఎయిర్ షోలో కలిసిన మాట వాస్తవమే. ప్రధాన మంత్రి కూడా ఏనాడు నన్ను దీని గురించి వివరణ కోరలేదు. మా ప్రభుత్వం అవినీతిని రూపుమాపాలని గట్టిగా ప్రయత్నిస్తున్నప్పుడు, నేనే నా శాఖలో అవినీతిని, అవినీతిపరులను ఎందుకు ప్రోత్సహిస్తాను?నేను కానీ, నా సిబ్బంది గానీ ఎటువంటి అవినీతికి పాల్పడలేదు,” అని చెప్పారు.
ఈరోజుల్లో స్వయంగా వందలు, వేలకోట్ల అవినీతికి పాల్పడుతున్నవారు, బ్యాంకులకి డబ్బు ఎగవేస్తున్నవారు, జైలుకి వెళ్ళివచ్చిన వారు, సిబిఐ చార్జ్ షీట్లలో పేర్లున్నవారు కేంద్ర మంత్రులుగా, పార్లమెంటు సభ్యులుగా కొనసాగుతున్నారు. తాము చాలా నిజాయితీపరులమని నిసిగ్గుగా చెప్పుకొంటూ తిరుగుతున్నారు. కానీ అశోక్ గజపతి రాజు మాత్రం తన క్రింద పనిచేసే సిబ్బంది అవినీతికి పాల్పడినా అందుకు తానే బాధ్యుడినని ధైర్యంగా చెప్పుకోవడం ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి అద్దంపడుతోంది.