గత ప్రభుత్వం నిర్వాకంతో విసిగి వెళ్లిపోయిన కంపెనీలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఆహ్వానిస్తోంది. సీఎం చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నాక, ఆయా కంపెనీలు ఎందుకు వెళ్లిపోయాయి… తిరిగి వస్తే ప్రభుత్వం నుండి ఇచ్చే సపోర్ట్ పై కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతుండటంతో సానుకూల వాతావరణం ఏర్పడుతోంది.
గత ప్రభుత్వ విధానాలు నచ్చక ఏపీ నుండి ప్రముఖ సంస్థ అశోక్ లేలాండ్ సంస్థ వెళ్లిపోయింది. భారీ వాహనాల తయారీలో మేటి కంపెనీగా ఉన్న ఈ సంస్థ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈ కంపెనీ గన్నవరం మండలంలో మూడేళ్ల కిందట ప్రొడక్షన్ ప్రారంభించి.. ప్రభుత్వ సహకారం లేక ఆపేశారు. ఇప్పుడు మళ్లీ ట్రాక్ లో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యే యార్లగడ్డ కూడా కంపెనీ ప్రతినిధులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో కంపెనీ తిరిగి రావటానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ నుండి వెళ్లిపోయి, తిరిగి వస్తున్న కంపెనీ అశోక్ లేలాండ్.
ఈ ఒక్క కంపెనీయే కాదు అచీ మసాలా సహా పలు కంపెనీలు కూడా అమరావతి చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టేందుకు గతంలో ముందుకు వచ్చాయి. కానీ, జగన్ సర్కార్ అమరావతిపై కక్షగట్టడంతో వెనక్కి వెళ్లగా… ఆయా కంపెనీలు కూడా వచ్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కంపెనీలు తమ ప్లాంట్స్ పెట్టుకునే ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రెడీగా ఉంది. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని… ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతుందని సర్కార్ భావిస్తోంది. పరిశ్రమల కోసం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసి, వేగంగా అనుమతులు ఇచ్చేలా సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది.