పిల్లజమిందార్, భాగమతి చిత్రాలతో ఆకట్టుకొన్నాడు అశోక్. ఆ తరవాత.. అశోక్ ఓ సినిమా చేశాడు. అది ఫ్లాప్ అయ్యింది. అప్పటి నుంచి అశోక్ ఏం చేస్తున్నాడు? తన తదుపరి సినిమా ఎవరితో అనే విషయాలేం తెలీలేదు. అయితే ఈలోగా ఆయన గప్ చుప్‌గా ఓ సినిమా చేసేశారు. దానికి ‘ఎస్.. బాస్’ అనే పేరు ఖరారు చేశారు. హవీష్, బ్రహ్మానందం ఇందులో హీరోలు. హవీష్ సేవకుడు.. బ్రహ్మానందం బాసన్నమాట. ఇదీ కథ. షూటింగ్ అయిపోయింది. జులైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేస్తారు. బ్రహ్మానందం ఫుల్ లెంగ్త్ సినిమాలు చేసి చాలా కాలమైంది. ఆయన్ని చిత్రసీమ దాదాపుగా మర్చిపోతున్న తరుణంలో ‘రంగమార్తాండ’ వచ్చింది. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్రకు మంచి స్పందన వచ్చింది. కానీ సినిమా మాత్రం ఆడలేదు. దాంతో ఆయన కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. అయితే.. ‘ఎస్ బాస్’.. లో బ్రహ్మీ క్యారెక్టర్ కొత్త తరహాలో ఉంటుందట. `రంగమార్తాండ`లో బ్రహ్మీని చూసి ఎలా ఆశ్చర్యపోయారో.. అలా ఇందులోని పాత్ర ఉండబోతోందని టాక్. ఈ సినిమాకి టెక్నికల్ టీమ్ సపోర్ట్ కూడా గట్టిగానే ఉంది. అనూప్ సంగీతాన్ని అందించాడు. కబీర్‌లాల్ కెమెరామెన్‌గా పనిచేశారు. అశోక్ ప్రతిభావంతుడే కానీ.. తన వర్కింగ్ స్టైల్ పట్ల చాలా కామెంట్లు వినిపిస్తాయి. భాగమతి సమయంలో యూవీ క్రియేషన్స్ తో కాస్త పేచీ నడిచింది. ఆ తరవాత అశోక్ ఎవరితో సినిమా తీసినా ఇదే సమస్య. అయినా తనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే.. తాను ఆశించనంత బ్రేక్ అయితే రాలేదు. మరి ఈసారి ఏం జరుగుతోందో చూడాలి.