అసలు ఏం తెలుసని..చిరంజీవికి మూడు రాజధానులకు మద్దతు పలికారని.. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చిరంజీవిపై డైరక్ట్ గా ఫైరయ్యారు. రైతుల గురించి చిరంజీవి ఎందుకు ఆలోచించలేకపోయారని ప్రశ్నించారు. చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్.. కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వెళ్లారని.. ఆయన రైతులకు మద్దతుగా నిలిచిన విషయాన్ని చిరంజీవి ఎందుకు గుర్తించలేదని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలో బహుళ రాజధాని వ్యవస్థ ఫెయిలయిందనే సంగతి చిరంజీవికి తెలియదా అని ప్రశ్నించారు. మెగా బ్రదర్స్ అమరావతి విషయంలో.. మూడు రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చిరంజీవి.. మూడు రాజధానులకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పవన్ కల్యాణ్ అమరావతి రైతుల కోసం పోరాడుతున్నారు. నాగబాబు.. మధ్యస్థంగా మాట్లాడుతున్నారు. ఇలా ముగ్గురు బ్రదర్స్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్న సమయంలో.. సినీ పరిశ్రమ నుంచి.. వారిపై .. ఓ నెగెటివ్ కామెంట్ తొలి సారి వినిపించింది.
అశ్వనీదత్ .. చిరంజీవికి ఆత్మీయుడు. మంచి స్నేహితుడు కూడా. కానీ.. రాజకీయాల్లో మాత్రం ఇద్దరి దారులు వేర్వేరు. అశ్వనీదత్.. చిరంజీవికి ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ.. ఆయన ప్రజారాజ్యం పార్టీపెట్టినప్పుడు ఆ పార్టీలోకి వెళ్లలేదు. చంద్రబాబు ఒత్తిడి మేరకు టీడీపీలో చేరి.. విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చిరంజీవితో.. తన స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నారు. అయితే.. అమరావతి రాజధాని అంశంలో.. చిరంజీవిపై.. ఓ టీవీ చానల్‌కు ఇంటర్యూ ఇచ్చి మరీ విమర్శలు గుప్పించారు అశ్వనీదత్.
టాలీవుడ్ నుంచి.. ఎవరూ.. అమరావతికి మద్దతుగా మాట్లాడటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. నేరుగా కాకపోయినా… చిరంజీవి మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా ప్రకటన చేయడంపై.. విమర్శలు చేయడం ద్వారా.. టాలీవుడ్ నుంచి తొలి సారి స్పందన బయటకు వచ్చింది. ఈ ట్రెండ్ ఇలా కొనసాగుతుందో లేదో చూడాలి. నిజానికి అమరావతి తరలి పోతే.. అశ్వనీదత్‌కు వ్యక్తిగతంగా కూడా నష్టం వాటిల్లుతుంది. గన్నవరం విమానాశ్రయం రన్ వే విస్తరణ కోసం.. ప్రభుత్వానికి భూములు ఇచ్చిన వారిలో అశ్వనీదత్ ..కూడా ఉన్నారు. దానికి ప్రతిఫలంగా.. వారికి అమరావతిలో కొంత స్థలం ఇస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు.. ప్రభుత్వం స్థలం ఇచ్చినా.. ఎందుకూ ఉపయోగపడని పరిస్థితి..రాజధాని తరలింపుతో ఏర్పడుతుంది.