వైజయంతీ మూవీస్ పై అనేక చిత్రాలు తీసిన అనుభవం నిర్మాత అశ్వనీదత్ ది. ఆయన కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు వున్నాయి. ఎన్నో పాఠాలు వున్నాయి. ముఖ్యంగా సినిమాల బడ్జెట్ విషయంలో అశ్వనీదత్ అంచనా చాలా సార్లు తప్పింది. అనుకున్న బడ్జెట్ కి దాటిపోయే చాలా చిత్రాలు ఆయన ఖాతాలో వున్నాయి. ఇపుడు వారి పిల్లలు స్వప్నదత్, ప్రియాంక దత్ విషయంలో బడ్జెట్ లెక్కలు తప్పుతుంటాయి. ఈ విషయాన్ని వారే అంగీకరించారు.
”మహానటి సినిమాని పది కోట్లలో తీసేస్తామని అనుకున్నాం. ఇదే సంగతి నాన్నకి చెబితే ఓ నువ్వు నవ్వి.. ఇరవై ఐదు కోట్లు కంటే తక్కువైతే నేను పేరు మార్చుకుంటానని చెప్పారు. ఆయన చెప్పినట్లు అది ఆ ఫిగర్ కి దాటిపోయింది. బడ్జెట్ విషయంలో నాన్న పోలికలే మాకు వచ్చాయని అనుకుంటాం. పేపర్ మీద పద్దతిగానే లెక్కలు వేసుకుంటాం. కానీ రంగలోకి దిగిన తర్వాత బడ్జెట్ ని కథ కంట్రోల్ చేస్తుంది. కథ డిమాండ్ చేసింది ఇవ్వడం తప్పితే మా చేతుల్లో వుండదు. అన్నీ లెక్కలు వేసుకుంటే అసలు సినిమాలే తీయకూడదు. పెట్టుబడికి లాభాలు ఇచ్చే వ్యాపారాలు చాలానే వున్నాయి. సినిమాలు తీయాలనే ప్యాషన్ తోనే ఇక్కడ వున్నాం తప్పితే లెక్కలేసుకొని కాదు” అని చెప్పుకొచ్చారు.