5100 రూట్లను ప్రైవేటు సంస్థలకు ఇచ్చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ప్రైవేటీకరణ తప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెగేసి చెప్పేశారు. అయితే, రూట్లు ఇలా ప్రైవేటీకరించడం వల్ల కార్మికులు, ఉద్యోగులకు మరో సమస్య వస్తుందంటున్నారు జేయేసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. 5100 రూట్లను ప్రైవేటుకి ఇచ్చేస్తే… 50 వేలమంది కార్మికుల్లో 27 వేలమంది మాత్రమే సరిపోతారనీ, మిగతా 23 వేల మంది కార్మికుల సంగతి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రైవేటు రూట్లలో ప్రైవేటు బస్సులు, ఆ సంస్థల డ్రైవర్లూ సిబ్బంది విధుల్లోకి వస్తే… ఈ 23 వేలమందికి ఉపాధి ఎక్కడ ఉంటుందన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిగణనలోకి తీసుకోలేదనీ, ఈ కార్మికుల సంగతి ఏంటని కూడా ప్రకటన చేయలేదన్నారు.
ముఖ్యమంత్రి నిర్ణయం వల్ల 97 డిపోల్లో 45 ప్రైవేటు సంస్థలకు వెళ్లిపోతాయనీ, దాంతో డీఎంలూ డీవీఎంల పోస్టులు కూడా తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని డీఎంలూ డీవీఎంలు ఆలోచించాలనీ, హక్కుల కోసం తమతో కలిసి పోరాడాలన్నారు అశ్వత్థామరెడ్డి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రకారం ఇన్నాళ్లూ ఆర్టీసీలో నియాకమాలున్నాయనీ, ఇప్పుడు ప్రైవేటుపరం చేసేస్తే వారు ఈ కోటాలను పాటిస్తారా అనేది అనుమానమే అన్నారు. ఇవన్నీ లోతుగా ఆలోచించాలనీ, ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలను తీసే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం చూపకుండా, డెడ్ లైన్లు పెట్టడమేంటన్నారు. ఉద్యోగాల్లో చేరిపోవాలంటూ కార్మికులకు ఇప్పటివరకూ నాలుగుసార్లు డెడ్ లైన్లు పెట్టారనీ, ఈ సమయంలో డెడ్ లైన్లకు భయపడి వెళ్లిపోతే ఆత్మద్రోహం అవుతుందన్నారు. సమ్మె కొనసాగుతుందనీ, ప్రభుత్వం కదిలి వచ్చేవరకూ పట్టువీడేది లేదన్నారు అశ్వత్థామరెడ్డి.
5లోగా విధుల్లో చేరడానికి అవకాశం ఇచ్చామని ప్రభుత్వం ప్రకటించినా… దానికి కార్మికుల నుంచి పెద్దగా స్పందన లేని మాట వాస్తవమే. కార్మికులను విధుల్లోకి చేరేలా ప్రోత్సాహించాలంటూ జిల్లాల వారీగా కొంతమంది మంత్రులకు కూడా గతంలో కేసీఆర్ పురమాయించారు. సంఘాల నేతలతో చర్చలు జరపాలనీ, ఉద్యోగులను విధుల్లోకి తెచ్చే బాధ్యత వారిపై పెట్టినా… ఆ వ్యూహం పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పటి డెడ్ లైన్ కూడా కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేసే ప్రయత్నంగానే చూడాలి. కార్మికులకు జీతాల్లేకపోయినా, సెల్ఫ్ డిస్మిస్ అయిపోయారని ప్రభుత్వం చెబుతున్నా… ఇప్పటివరకూ విధుల్లో చేరినవారి సంఖ్య కేవలం 9 మంది మాత్రమే.