నాగశౌర్య అంటే ప్రేమకథలే గుర్తుకు వస్తాయి. తన కెరీర్లో విజయవంతమైన చిత్రాలన్నీ అవే. సొంత సంస్థలో తీసిన ‘ఛలో’ కూడా ఓ ప్రేమకథే. అయితే ఈసారి నాగశౌర్య రూటు మార్చాడు. ఓ యాక్షన్ థ్రిల్లర్‌ని ఎంచుకున్నాడు. అదే ‘అశ్వద్ధామ’. ఉమెన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ కథని స్వయంగా నాగశౌర్యనే రాశాడు. తన స్నేహితుడు రమణ తేజకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. ఈ సినిమాపై ముందు నుంచీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్లో ఆశలు పెరిగాయి. ఇప్పుడు ట్రైలర్‌తోనూ ఆ ఆశల్ని, అంచనాల్నీ సజీవంగా ఉంచాడు నాగశౌర్య.
“రాక్షసుడినీ, భగవంతుడినీ చూసిన కళ్లు…. ఇక ఈ ప్రపంచాన్ని చూసే అర్హత కోల్పోతాయి” – అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలెట్టారు. ట్రైలర్ అంతా ఇంటెన్స్‌గా సాగింది. తెరపై స్క్రీన్ ప్లే ఏ రకంగా సాగుతుందో తెలీదు గానీ, ట్రైలర్ మాత్రం పరుగులు పెట్టేలా ఉంది. తన చెల్లాయి ఉనికిని తెలుసుకోవడానికి ఓ అన్న చేసిన ప్రయత్నం ఇది. ఆడపిల్లల కిడ్నాపులు, వాటి వెనుక ఉన్న ముఠా – ఆ గుట్టు రట్టు చేసే పాత్రలో నాగశౌర్య కనిపించోతున్నాడు.
ఆడపిల్ల చావుమీద మీకెందుకంత ఇంట్రెస్టు. దాని మీద వందల కథనాలు, వేల అబద్దాలూ పుట్టించేవరకూ వదలరా.. అనే సగటు తండ్రి ఆవేదన చూస్తే ఈ సినిమాలోని ఎమోషన్ పీక్స్‌లో ఉందని అర్థం అవుతుంది.
ఎటువెళ్తున్నా మూసుకుపోయే దారులు, ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు, వేటకుక్కలా వెంటపడే జాలర్లు, శకునిలాంటి ఓ ముసలోడు, వీళ్లందరినీ ఒకే స్టేజీపై ఆడిస్తున్న సూత్రధారి ఎవరు? – అన్నదే ఈ సినిమాలో కీలక అంశం. ఓ యాక్షన్ థ్రిల్లర్‌కి కావల్సిన అన్ని అంశాలూ ట్రైలర్లో కనిపించాయి. నేపథ్య సంగీతం సినిమా మూడ్‌కి తగ్గట్టు సాగుంది. నాగశౌర్య కూడా ఇది వరకెప్పుడూ కనిపించని పాత్రలో కనిపించబోతున్నాడు. మరి.. ఈ ప్రయత్నం ఎంత వరకూ సఫలీకృతం అవుతుందో తెలియాలంటే ఈనెల 31 వరకూ ఆగాలి. ఎందుకంటే ‘అశ్వద్ధామ’ అప్పుడే విడుదల అవుతుంది.