చెపాక్ టెస్ట్ లో భారత్ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇంగ్లండ్ ముందు 482 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ అద్వితీయమైన సెంచరీ సాధించడంతో.. భారత్ మరోసారి మంచి స్కోరు సాధించింది. కొహ్లి (62) రాణించడంతో పాటు.. చివర్లో సిరాజ్ (16 నాటౌట్) చక్కటి సహకారం అందించాడు. దాంతో.. భారత్ తన రెండో ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓ దశలో 106 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన భారత్ ని.. కోహ్లి, అశ్విన్లు ఆదుకున్నారు. కొహ్లి అవుట్ అయినా… అశ్విన్ తన పోరాటం కొనసాగించాడు. టెయిల్ ఎండర్ల సహకారంతో.. సూపర్ సెంచరీ సాధించాడు. కెరీర్ మొత్తంలో అశ్విన్ కి ఇది 5వ సెంచరీ. ఇంగ్లండ్ పై తొలి సెంచరీ. తొలి ఇన్నింగ్స్లో అశ్విన్ 5 వికెట్లు సాధించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఇప్పటికే పిచ్ స్పిన్ కు అనుకూలిస్తోంది. నాలుగో ఇన్నింగ్స్ లో బంతి మరింత స్పిన్ అవ్వడం ఖాయం. ఈ నేపథ్యంలో.. అశ్విన్ ఈ విజయ లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యం అనిపిస్తోంది. నాలుగో రోజే ఇంగ్లండ్ ఆట ముగిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.