నాగ్ అశ్విన్ తెలుసు కదా..? ఎవడే సుబ్రమణ్యం దర్శకుడు. ఇప్పుడు… అశ్వనీదత్ అల్లుడు. ఎవడే సుబ్రమణ్యం సమయంలోనే అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ తో ప్రేమలో పడ్డాడు. ఆ తరవాత… ఇంట్లో ఒప్పించి ఇద్దరూ పెళ్లి చేసుకొన్నాడు. నాగ్ అశ్విన్‌తో ఇప్పుడు మామగారు అశ్వనీదత్ ఓ మెగా సినిమా ప్లాన్ చేస్తున్నారు. సావిత్రి జీవిత కథను ఆధారంగా చేసుకొని నాగ్ అశ్విన్ ఓ కథ సిద్ధం చేశాడు. అదే.. ‘మహానటి’. ఈసినిమాని బాలీవుడ్ స్థాయిలో తీయాలన్నది అశ్వనీదత్ ప్రయత్నం. అందుకోసం ఓ బాలీవుడ్ నటిని దిగుమతి చేయాలని చూస్తున్నారు.
ప్రియాంకా చోప్రా, సోనాక్షి సిన్హా, దీపికా పదుకొణె… ఇలా స్టార్ కథానాయికల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో ఎవరు ఓకే అన్నా.. ఈ సినిమా పట్టాలెక్కేయడం ఖాయం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాని రూపొందిస్తారట. అన్నట్టు.. ఈ సినిమాకి నిర్మాత కూడా అశ్వనీదత్తే. ఎంతైనా అల్లుడ్ని ప్రమోట్ చేసుకోవాలి కదా? మొత్తానికి మన నటి సావిత్రి.. కథని బాలీవుడ్ స్థాయిలో తీయాలనుకోవడం అభినందనీయమే.కానీ.. సావిత్రి పాత్ర పోషించడానికి మన దగ్గర హీరోయిన్లే లేరా??