రాజ్ కోట్ టెస్టులో భారత బౌలర్లు విజృంభించారు. రెండో రోజు వికెట్లు తీయడంలో విఫలమైన బౌలింగ్ దళం. మూడో రోజు లయలోకి వచ్చారు. 207/2 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ చివరికి 319 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అంటే ఈరోజు భారత బౌటర్లు 112 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీసుకొన్నారన్నమాట. భారత బౌలర్లలో సిరాజ్‌కు 4 వికెట్లు దక్కాయి. కులదీప్, జడేజా చెరో రెండు వికెట్లు పంచుకొన్నారు. మొత్తమ్మీద భారత్ కు 124 పరుగుల కీలక ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 250 పరుగులు చేసినా, భారత్ ఈ మ్యాచ్‌పై పట్టు సాధించినట్టే.
*అశ్విన్ కు ఏమైంది?
మూడో టెస్ట్ మూడో రోజు మైదానంలో అశ్విన్ కనిపించలేదు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో అశ్విన్ హఠాత్తుగా ఇంటికి పయనమయ్యాడు. దాంతో భారతజట్టు 10మంది ఆటగాళ్లతోనే ఈ మ్యాచ్ ఆడాల్సివస్తోంది. అశ్విన్ బదులుగా మరో ఆటగాడ్ని తీసుకొన్నా కేవలం ఫీల్డింగ్ కి మాత్రమే పరిమితం చేయాలి. అశ్విన్ అత్యవసర పరిస్థితుల్లో మైదానం వీడాల్సివచ్చినందున కంకషన్ ప్లేయర్ ని తీసుకొనే అవకాశం లేకుండా పోయింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 10మంది బ్యాటర్లే బ్యాటింగ్ చేస్తారు. బౌలింగ్ లో నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లే అందుబాటులో ఉన్నారు.