సినీ పరిశ్రమలో నిర్మాత అశ్వినీదత్ ప్రయాణం పడిలేస్తూనే సాగింది. ఇండస్ట్రీ హిట్లతో పాటు డిజాస్టర్లు చూసిన నిర్మాత ఆయన. ఒక దశలో సినిమాలు మానేయాలని కూడా భావించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో తీసిన ‘శక్తి’ ఆయనకి ఓ పీడ కలలా మిగిలింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ నిర్మాతగా ఆయన పేరు ఇండస్ట్రీలో పెద్దగా వినిపించలేదు. వయసు కూడా పైబడటంతో ఆయన కూడా ఇక సినిమాలని తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చేశారు.
అయితే సరిగ్గా ఇదే సమయంలో వైజయంతి మూవీస్ కి పునర్వైభవం తీసుకురావాలని బలంగా నిర్ణయించుకున్నారు అశ్వినీదత్ వారసులైన ప్రియాంక, స్వప్న. మారుతున్న ప్రేక్షకుల అభిరుచితగ్గట్టు కథల ఎంపిక నుంచి సినిమా నిర్మాణం వరకూ అన్నీ తామై బ్యానర్ ని ముందుకు నడిపారు. నాగ్ అశ్విన్ ప్రతిభపై వున్న నమ్మకంతో ఒక ప్రయోగాత్మక చిత్రంలానే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాని నిర్మించారు. మంచి పేరొచ్చింది. నిజానికి ఈ సినిమా నిర్మాణంలో కూడా అశ్వినీదత్ దూరంగానే వున్నారు.
తర్వాత మహానటి లాంటి క్లాసిక్ తీసిన మళ్ళీ సగర్వంగా తండ్రి పేరుని ప్రజెంటర్ గా వేశారు స్వప్న, ప్రియాంక. మరో క్లాసిక్ గా వచ్చిన సీతారామంతో వైజయంతి మూవీస్ పేరు మరోసారి మార్మ్రోగిపోయింది.
ఇప్పుడు ‘కల్కి’తో పాన్ వరల్డ్ సినిమాని అందించబోతున్నారు అశ్వినీదత్. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో గొప్ప జ్ఞాపకాలని అశ్వినీదత్ కి ఇచ్చింది. ప్రీరిలీజ్ బిజినెస్ ఏ స్థాయిలో జరుగుతోందో కళ్ళారా కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో భాగమైన గొప్ప నటీనటులు, వారు నిర్మాతగా ఆయనకి ఇచ్చిన గౌరవం అశ్విన్ దత్ సినీ జీవితంతో ఓ గొప్ప ఘట్టం.
ఇటీవల జరిగిన ఈవెంట్ లో అమితాబ్, అశ్వినీదత్ కు పాదాభివందనం చేశారు. ఇందులో ఎవరు గొప్ప, ఎవరు చిన్న, ఎవరు పెద్ద? అనేది అంశం కాదు. సినిమాని నడిపించేది నిర్మాత. అలాంటి నిర్మాతకు ఒక నటుడు ఇచ్చిన గౌరవం అది. అమితాబ్ లాంటి లెజెండ్ నుంచి అలాంటి గౌరవాన్ని పొందడం నిజంగా ఒక అదృష్టంగానే భావించాలి. ఒక నిర్మాతకి అంతకంటే గౌరవం మరొకటి వుండదు.
నిజానికి ఈ విషయంలో ప్రియాంక, స్వప్నలని మెచ్చుకోవాలి. శక్తి సినిమా తర్వాత ఆగిపోతుందేమో అనుకున్న బ్యానర్ ని ఈ స్థాయికి తీసుకురావడంలో వారి కష్టం ఎంతో వుంది. సినిమా కోసం చాలా అంకిత భావంతో పని చేస్తారు. వారి అంకితభావంతో వైజయంతి మూవీస్ ని ఈ స్థాయికి తీసుకొచ్చింది తండ్రికి గొప్ప గౌరవాన్ని చేకూర్చారు. నిజంగా ఈ విషయంలో అశ్వినీదత్ వెరీ ప్రౌడ్ ఫాదర్. ప్రౌడ్ ప్రొడ్యూసర్.