నంది అవార్డుల్ని ప్రభుత్వాలు ఎప్పుడో మర్చిపోయాయి. ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, రఘపతి వెంకయ్య అవార్డ్.. వీటిని గాలికి వదిలేశారు. మరి సినిమా వాళ్లని ఎవరు పట్టించుకొంటారు? ఎప్పుడు పట్టించుకొంటారు? ఈ విషయంపై ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ”ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అవార్డులు ఇమ్మంటే ఇస్తారు. సినిమా అవార్డులు రావాలంటే.. ఇంకొంత కాలం ఆగాలి. అప్పుడు అందరికీ అవార్డులు వస్తాయి” అంటూ.. పరోక్షంగా వైకాపా ప్రభుత్వ తీరుని విమర్శిస్తూ, త్వరలోనే టీడీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు అందరికీ ఎప్పటిలా అవార్డులు ఇస్తారని చెప్పుకొచ్చారు అశ్వనీదత్. ఆయన స్వతహాగా టీడీపీ అభిమాని. అందుకే… ఈ తరహా వ్యాఖ్యానాలు చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న మోసగాళ్లకు మోసగాడు సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అశ్వనీదత్ అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా అవార్డులకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అప్పుడే అశ్వనీదత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని ఆయన అభిమానులు ఆశ పడుతున్నారు. ఆయన అందుకు అర్హుడు కూడా. ఈ విషయంలో అభిమానులంతా కలిసి.. ఓ కమిటీగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. దీనిపై కృష్ణ కుటుంబం స్పందన ఏమిటి? అని అడిగినప్పుడు కృష్ణ సోదరుడు ఆదిశేఖగిరిరావు స్పందించారు. ”అవార్డుల గురించి ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు. వస్తే తీసుకొన్నారు. లేదంటే లేదు. మా తరపున ప్రభుత్వానికి ఎలాంటి వినతీ చేయం.. ఇస్తే ఇచ్చారు, లేదంటే లేదు” అన్నారు. బుర్రిపాలెంలో కృష్ణ పేరుతో ఓ వృథాశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు ప్రకటించారు. అంతేకాదు.. కృష్ణ జ్ఞాపకార్థం ఓ మ్యూజియంని పద్మాలయా స్టూడియో ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.