ఏపీలో జగన్ రెడ్డి పాలనకు ప్రజలు చరమగీతం పాడతారనే విషయాన్ని తాను ముందే ఊహించానని, ఎక్కడకు వెళ్లినా, ఎవరితో మాట్లాడినా జగన్ దిగిపోవాలన్న ఆకాంక్షే కనిపించిందని, ఇప్పుడు ఏపీలో అదే జరిగిందన్నారు ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్. చంద్రబాబు నాయుడు హయాంలో అశ్వనీదత్‌కు నామినేటెడ్ పదవులు వస్తాయన్న ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. దీనిపై కూడా ఆయన స్పందించారు. అవన్నీ గాసిప్పులేనని, చిత్రపరిశ్రమకు సంబంధించి కీలకమైన వ్యక్తులకు చంద్రబాబు నాయుడు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారని, వాటిని నిర్వర్తించేందుకు తామంతా సిద్ధమని చెప్పారు. తెలుగు చిత్రసీమ విశాఖపట్నంలోనూ అభివృద్ధి చెందుతుందని, అయితే హైదరాబాద్ ని మాత్రం టాలీవుడ్ వదులుకోదని వ్యాఖ్యానించారు.
అశ్వనీదత్ తెరకెక్కించిన ‘కల్కి’ ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అశ్వీనీదత్ హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. రికార్డుల్ని లక్ష్యంగా చేసుకొని తామెప్పుడూ సినిమాలు చేయలేదని, అయితే కల్కి మాత్రం కనీసం 1400 నుంచి 1500 కోట్లు సాధించే అవకాశం ఉందని, తొలిరోజు వచ్చిన వసూళ్లు అంతటి నమ్మకాన్ని కలిగించాయని చెప్పుకొచ్చారు. ”కల్కి 2′ కి సంబంధించిన కొంతమే చిత్రీకరణ జరిగింది. పార్ట్ 2 పూర్తవ్వడానికి కనీసం యేడాదిన్నర పడుతుంది. నాగ అశ్విన్‌పై నాకు చాలా గట్టి నమ్మకం. తను ఏ కథ చెప్పినా, ఏమాత్రం ఆలోచించకుండా సినిమాలు తీయమని మా అమ్మాయిలకు చెప్పాను” అన్నారు.