సంక్రాంతి పండుగకు కేవలం తెలుగు చిత్రాలను మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయాలంటూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి చేసిన ప్రకటన దిల్ రాజు నిర్మిస్తున్న ‘వారసుడు’ చిత్రం విడుదలకు అడ్డంకి గా మారింది. విజయ్ తో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం వారిసు. ఈ సినిమాని సంక్రాంతి తెలుగులో వారసుడు పేరుతో విడుదల చేయాలని నిర్ణయించారు. ఐతే నిర్మాతల మండలి ప్రకటన ఒక అవరోధంగా మారింది. కాగా ఈ ప్రకటనపై తమిళనాడు వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించిన విధంగానే జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అక్కడి నుండి హెచ్చరిక వినిపిస్తున్నాయి.
అయితే నిర్మాతల మండలి ప్రకటనపై కొందరు టాలీవుడ్ పెద్దలు కూడా పెదవి విరుస్తున్నారు. ఈ జాబితాలో అగ్ర నిర్మాత అశ్వనీదత్ చేరారు. సంక్రాంతికి విడుదలయ్యే అనువాద చిత్రాలకి థియేటర్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వకూడదన్న ప్రకటనని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు అశ్వినీదత్. ఇలాంటి ప్రకటనలు పరిశ్రమని తప్పుదోవ పట్టించడంతోపాటు… పొరుగు పరిశ్రమలతో ఉన్న అనుబంధాల్ని, మన మార్కెట్ని దెబ్బతినేలా చేస్తాయన్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా నిర్మాతల మండలి ప్రకటనని ఖండించారాయన.
అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలు దిల్ రాజు కి కాస్త ఉపసమనం ఇచ్చినట్లుగానే వున్నాయి. అయితే ఇక్కడ అశ్వనీదత్ ముందు జాగ్రతని కూడా ప్రస్తావనలోకి వస్తోంది. ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె సినిమా చేస్తున్నారు అశ్వనీదత్. ఇది పాన్ ఇండియా సినిమా. తెలుగుతో పాటు తమిళ్ లో విడుదల కావాలి. ఒకవేళ నిర్మాతల మండలి ప్రకటనతో రెండు పరిశ్రమల మధ్య గ్యాప్ వస్తే ఆయన సినిమాకి కూడా నష్టం జరుగుతుంది. అందుకే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అశ్వనీదత్ వ్యవహరిస్తున్నారని చెప్పాలి.