తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమ్ ఇండియా చేతులు ఎత్తేసింది. వరుసగా రెండో పరాభవంతో.. ఆసియా కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈరోజు శ్రీలంకతో జరిగిన కీలకమైన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయి.. ఇంటి దారి పట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 172 పరుగులు చేసింది. అందుకు బదులుగా బ్యాటింగ్ కి దిగిన శ్రీకలం లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే ఛేధించింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ స్వల్ప వ్యవధిలో రెండు కీలకమైన వికెట్లు (రాహుల్, విరాట్) కోల్పోయింది. అయితే రోహిత్ శర్మ (41 బంతుల్లో 72) బాధ్యతాయుతమైన బ్యాటింగ్ తో ఇన్నింగ్స్ ని కుదుట పరిచాడు. సూర్య కుమార్ యాదవ్ (34) మినహాయిస్తే మరెవ్వరూ బ్యాట్ ఝులిపించలేకపోయారు. చివర్లో వేగంగా పరుగులు సాధించడంలో భారత్ విఫలమైంది.
శ్రీలంక ఓపెనర్లు నిసాంక (52), మెండీస్ (57) తొలి వికెట్కు మెరుపు వేగంతో 97 పరుగులు జోడించారు. ఆ తరవాత చాహల్ వరుసగా 3 వికెట్లు తీసి భారత శిబిరంలో ఆశలు నింపాడు. ఆఖరి 12 బంతుల్లో 21 పరుగులు అవసరమైన వేళ భువనేశ్వర్ కుమార్ 19 వ ఓవర్లో 14 పరుగులు ఇవ్వడంతో… శ్రీలంక విజయం సునాయాసమైంది. చాహల్ తప్ప భారత బౌలర్లు ఎవరూ రాణించకపోవడంతో… 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ కాపాడుకోలేలకపోయింది. సూపర్ 4లో భారత్ తన చివరి మ్యాచ్ ఆఘ్గనిస్థాన్ తో తలపడుతుంది. ఆ మ్యాచ్ లో గెలిచినా భారత్ కు ఉపయోగం లేనట్టే.