తెలంగాణ కాంగ్రెస్ నేత ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమంలో… చాలెంజ్ చేసినట్లుగా..ప్రగతిభవన్ గేటును ముట్టుకోవడం ప్రభుత్వ పెద్దలకు మంట పెట్టించింది. ఎంత సెక్యూరిటీ ఏర్పాటు చేసినా.. రేవంత్ రెడ్డి.. అసలు… ప్రగతిభవన్ గేటు వద్దకు ఎలా వచ్చాడో విచారణ జరిపి… చివరికి సీఎం ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉన్న అధికారిపై వేటు వేశారు. ప్రగతి భవన్ దగ్గర విధి నిర్వహణలో అలసత్వం వహించారని… ఆసిఫ్ నగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. రేవంత్ ప్రగతి భవన్ గేటు వద్దకు రావడాన్ని ప్రభుత్వ వర్గాలు సీరియస్‌గా తీసుకున్నాయి. నర్సింహారెడ్డి ప్రగతి భవన్ వద్ద సెక్యూరిటీ ఇన్చార్జ్ గా ఉన్నారు. ఆయనను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించిన రేవంత్.. చాలెంజ్ చేసినట్లుగా.. ప్రగతి భవన్ ను ముట్టడించారు. బైక్ పై వచ్చి… గేటును తాకారు. ఈ రోజు గేటును తాకాం… రేపు గడీని బద్దలు కొడతామని చాలెంజ్ చేశారు. అసలు.. ఇంటి దగ్గరే రేవంత్ ను అదుపులోకి తీసుకోవాలనుకున్నారు కానీ.. సాధ్యం కాలేదు. అనుకున్నట్లుగా ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. దీని కోసం వందల మంది పోలీసుల్ని మోహరించినా.. అడ్డుకోలేకపోయారని ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్నారు. ఈ కోపంతో.. రేవంత్ పై కేసు కూడా నమోదు చేశారు.
చలో ప్రగతి భవన్ సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కల్గించారంటూ.. రేవంత్‌రెడ్డిపై 351, 353, 332 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ ఎస్ఐ నవీన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రేవంత్‌తో పాటు మరో ముగ్గురు అనుచరులపైనా కేసు నమోదయింది. ప్రభుత్వం ఉలిక్కిపడి తీసుకున్న ఈ చర్యలు రేవంత్ ముట్టడి సక్సెస్ రేంజ్ పెంచుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.