నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజెన్స్ .. ఎన్ఆర్సీ రాజకీయ అస్త్రంగా మారింది. కాంగ్రెస్తో సహా విపక్ష పార్టీలన్నీ.. దీనిపై భగ్గుమంటున్నాయి. సొంత దేశంలో పౌరులను శరణార్థులను చేశారంటూ మండిపడుతున్నాయి. మమతా బెనర్జీ అయితే.. సూపర్ ఎమర్జెన్సీతో పోల్చారు. పార్లమెంట్లో ఇదే అంశంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనికి జాతీయ స్థాయి నేతల నుంచి మద్దతు లభిస్తోంది. ఎన్ఆర్సీ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం స్పందించారు. 40 లక్షల మంది భారతీయులు కాదు పొమ్మంటే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాలు కాకుండా.. మానవతా దృక్ఫథంతో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
అక్రమంగా వలస వచ్చిన వారిని లెక్కించేందుకు ఎన్ఆర్సీని ఏర్పాటు చేశారు. ముసాయిదా జాబితాలో 40 లక్ష మంది అసలు భారత పౌరులు కాదని తేల్చింది. దీనిపై దుమారం రేగుతోంది. అసోంలో మొత్తం 3.29 కోట్ల మంది పౌరులు ఉంటే.. అందులో కేవలం 2 కోట్ల 89 లక్షల మందే ఇక్కడి పౌరులని తేల్చి చెప్పింది ఎన్ఆర్సీ. దీంతో మిగతా 40 లక్షల మంది శరణార్థులేనన్న అనుమానాలు బలంగా నాటుకుపోయాయి. ఇదే వాళ్లలో భయాందోళనలకు కారణమవుతోంది. భారతపౌరులు కాదని చెపుతున్న 40 లక్షల మంది ముస్లింలే. బెంగాలీ మాట్లాడే ముస్లింలే. అందుకే మమతా బెనర్జీ..కాస్త దూకుడుగానే వెళ్తున్నారు.
ఎన్ఆర్సీ జాబితాలో ఎన్నో లోపాలు బయటపడుతున్నాయి. దేశానికి సేవలు చేసిన ఆర్మీ ఆఫీసర్, మాజీ ఎమ్మెల్యే భార్య, ఎమ్మెల్యే చివరికి మాజీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులకు కూడా ఈ ఎన్ఆర్సీ జాబితాలో చోటు దక్కలేదు. దీంతో ఈ తప్పుల తడక ఎన్ఆర్సీని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టెన్షన్ ఇలా ఉంటే కొంత మంది బీజేపీ నేతలు.. దేశవ్యాప్తంగా ఈ ఎన్ఆర్సీ జాబితా ప్రకటించాలంటూ.. వింత వాదన తీసుకొస్తున్నారు. దీంతో ప్రజల్లో ఓ రకమైన భయాందోళనలు ప్రారంభమవుతున్నాయి. కానీ రాజకీయ పార్టీలు ప్రజల మనసుల్లో భయం అనే మంట పెట్టి చలి కాచుకుంటున్నాయి. బీజేపీ ఏదైతే కోరుకుందో.. అది వచ్చేస్తోందని… ఆ పార్టీ నేతలు సంబర పడిపోతున్నారు.