తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల యుద్ధానికి ఇంకా ఖచ్చితంగా నెల రోజులు ఉంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో నిర్వహించనుండగా ఏపీ, తెలంగాణలో నాలుగో విడత పోలింగ్ జరగనుంది. నాలుగో విడతలో భాగంగా ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆ రోజు నుంచి నా మినేషన్లు స్వీకరిస్తారు. 25 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు ఇసి గడువు ఇచ్చింది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది.
జూన్ 4న ఎన్నికల కౌం టింగ్ ఉంటుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూండటంతో అసలు రాజకీయ సందడంతా అక్కడే కనిపిస్తోంది. అక్కడ రాష్ట్ర అంశాలు మాత్రమే చర్చకు వస్తున్నాయి. అసెంబ్లీతో పాటే లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయని పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. లోక్ సభ అభ్యర్థులపైనా చర్చ జరగడం లేదు. అక్కడి దృష్టి అంతా అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. జగన్ బస్సు యాత్ర పేరుతో మెల్లగా కదలుతున్నారు. స్పందన లేకపోయినా మధ్య ఆపలేక సాగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సభలు పూర్తి చేస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చాక మరింత జోరు చూపించనున్నారు. మోదీ కూడా ప లుమార్లు సభల్లో ప్రసంగించే అవకాశం ఉంది.
తెలంగాలో లోక్ సభ ఎన్నికలే జరుగుతున్నాయి. నాలుగు నెలల కిందటి ఎన్నికల్లో గెలిచి అధికారం సాధించడంతో కాంగ్రెస్ లో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. 14 స్థానాలైన చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బలమైన నాయకత్వం లేని చోట పార్టీని బలోపేతం చేసే దిశలో ఎఐసిసి అనుమతితో పక్కా కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ సారి కాంగ్రెస్ తో బీజేపీ తలపడుతోంది.తమకూ డబుల్ డిజిట్ సీట్స్ వస్తాయంటోంంది. ఈ రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ నలిగిపోతోంది. బలమైన అభ్యర్థులు కూడా లేకపోవడంతో.. ఒక్క సీటు అయినా వస్తుందా రాదా అన్న టెన్షన్ లో ఉన్నారు.