విప్ ధిక్కరించారనే పాయింటును కూడా జత కలిపి తన పార్టీకి చెందిన (తెలుగుదేశంలోకి ఫిరాయించిన) ఎమ్మెల్యేల మీద వేటు పడేలా కంప్లయింటు చేయాలనే వైఎస్ జగన్ సంకల్పానికి అవకాశం లేకుండానే.. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసిపోయాయి. బడ్జెట్ సమావేశాలకు ఇవాళ చివరిరోజు కావడంతో తెదేపాలోకి వెళ్లిన తన పార్టీ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టడానికి జగన్ వారికి విప్ జారీ చేశారు. ఓటింగ్‌లో ఫైనాన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ వారికి ఇచ్చిన విప్లో పేర్కొన్నారు. అయితే.. సభలో అధికార పక్షం పక్కా ప్లానింగ్‌తో, వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేయడంతో అసలు ఓటింగ్ అనే ప్రక్రియే కార్యరూపంలోకి రాకుండా.. మూజువాణీ ఓటుతోనే ఫైనాన్స్ బిల్లు సభ ఆమోదం పొందింది. బడ్జెట్ సమావేశాల పర్వం అక్కడితో ముగిసిపోయింది. తన వారి మీద వేటు పడేలా చేయాలనుకున్న జగన్ కోరిక అంత ఈజీగా తీరే అవకాశం లేకుండాపోయింది.
మామూలుగా ఫైనాన్స్ బిల్లును మూజువాణీ ఓటుతోనే ఆమోదించేయడం జరుగుతూ ఉంటుంది. అయితే డివిజన్ కావాలని, ఓటింగ్ నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు రోజుల కిందటే స్పీకరుకు వినతిపత్రం ఇచ్చింది. అయితే నిర్ణయం స్పీకరు విచక్షణాధికారాలకు సంబంధించినది కావడంతో ఆయన ఏం చేస్తారా? అన్నది కీలకంగా మారింది.
సభాపర్వంలో చివరి రోజు మూజువాణీ ఓటుతో బిల్లు నెగ్గుతుందా? ఓటింగ్‌కు వస్తుందా? అనేదే కీలకాంశంగా రగడ జరిగే అవకాశం ఉన్నదంటూ తెలుగు360 డాట్ కాం బుధవారం ఉదయమే ఓ కథనాన్ని అందించింది. సభలో అచ్చంగా అదే అంశం రచ్చరచ్చ అయిపోయింది. జగన్ ఓటింగ్‌కు పట్టు పడితే ఆయన కోరికను స్పీకరు పట్టించుకోలేదు. మూజువాణీ ఓటు సరిపోతుందని, కావలిస్తే ప్రతిపక్ష నేత డివిజన్ కోరవచ్చునని, సభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు వివరించారు. స్పీకరు కోడెల శివప్రసాద్ దీనికి సంబంధించిన నిబంధనలను సభలో చదివి వినిపించారు. ఓటింగ్ అంటూ జరిగితే.. తమపార్టీనుంచి ఫిరాయించిన వారికి ఇచ్చిన విప్ ధిక్కరణ జరుగుతుందని వారి మీద ఫిర్యాదుకు బలం చేకూరుతుందని ఆశించిన జగన్ భంగపడాల్సి వచ్చింది.
ముందుగా ఊహించినట్లే.. వైకాపా సభ్యుల తీవ్ర నిరసనల మధ్య మూజువాణీ ఓటుతోనే ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందింది. సభా పర్వం ఒక కొలిక్కి వచ్చింది. ఆ తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతున్నట్లుగా ప్రకటించారు