పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి నోటి వెంట జాలు వారిన వందల కొద్దీ హామీల్లో… అత్యంత చర్చనీయాంశమైన హామీ 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు.. పెన్షన్ ఇవ్వడం. పాదయాత్రలో అనేక చోట్ల.. ఈ పెన్షన్ గురించి.. జగన్మోహన్ రెడ్డి గొప్పగా ప్రకటించారు. చేనేతలు, ఇతర వృత్తుల్లో ఉండే బలహీనవర్గాలకు చెందిన వారు… కష్టం చేసి.. చేసి.. 45 ఏళ్లకే సర్వశక్తులు కోల్పోతున్నారని.. వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. అప్పట్లో.. దీనిపై సెటైర్లు కూడా పడ్డాయి. జగన్మోహన్ రెడ్డికి కూడా 45 ేళ్లు వచ్చాయని ఆయనకు ముందు పెన్షన్ మంజూరు చేయాలని టీడీపీ నేతలు సెటైర్లు వేశారు. ఆయితే.. ఎన్నికల మేనిఫెస్టో దగ్గరకు వచ్చే సరికి.. ఆ విషయాన్ని అందులో రాయలేదు. కానీ పాదయాత్రలో ఇచ్చిన హామీ .. హామీనే కాబట్టి… తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ప్రస్తావించింది.
జగన్ ను ఇరుకున పెట్టిన 45 ఏళ్లకు పెన్షన్..!
మంగళవారం అసెంబ్లీ ప్రారంభమవగానే.. టీడీపీ… 45 ఏళ్లకే పెన్షన్ అంశాన్ని హైలెట్ చేసింది. పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చిన వీడియోను కూడా ప్రదర్శించింది. సాక్షి పత్రికలో బ్యానర్‌గా వచ్చిన జగన్ ప్రకటనను కూడా.. సభ్యులు ప్రదర్శించారు. 45 ఏళ్లకే… ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు ఇస్తామన్న పెన్షన్ ను ఇవ్వాలని.. మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై.. జగన్మోహన్ రెడ్డి విభిన్నంగా స్పందించారు. మేనిఫెస్టోలో ఆ హామీ లేదన్నట్లుగా మాట్లాడారు. మేనిఫెస్టోలో ఉన్నవన్నీ అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. మోసం చేయడం… అబద్దాలు చెప్పడం తనకు అలవాటు లేదని.. ప్రకటించేసుకున్నారు. టీడీపీ నేతలకు బుద్ది, జ్ఞానం లేదని… ఉంటే.. సభకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మేనిఫెస్టోలో లేదని కవర్ చేసుకున్న ప్రభుత్వం..!
జగన్ కు మద్దతుగా మంత్రులు… ఆ పెన్షన్ హామీని ఇవ్వలేదని చెప్పేందుకు… వరుసగా ప్రయత్నించారు. జగన్ ప్రకటనను టీడీపీ వక్రీకరించిందని… చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సమర్థించుకొచ్చారు. 45 ఏళ్లకే పెన్షన్ అని మేనిఫెస్టోలో లేదని.. మంత్రి పెద్దిరెడ్డి సాక్ష్యం తీసుకొచ్చారు. జగన్ మాట తప్పే వ్యక్తి కాదని సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. అందరికీ న్యాయం చేస్తామని.. నాలుగేళ్లలో నాలుగు విడతలుగా.. రూ. 75వేలు ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే… టీడీపీ నేతలు మాత్రం.. జగన్ హామీని అమలు చేయాల్సిందేనని పట్టుబట్టారు.
చర్చ పెరగకుండా… టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు..!
బలహీనవర్గాల వారికి ఇస్తామన్న పెన్షన్ విషయంలో.. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తూండటంతో… అధికారపక్షం… వెంటనే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు వేసింది. ఈ అంశాన్ని బలంగా వినిపించిన నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడులపై.. స్పీకర్ చైర్ లో కూర్చున్న కోన రఘుపతి.. సస్పెన్షన్ వేటు వేసి బయటకు పంపించేశారు. ఏదైనా అంశంలో రగడ చేసి.. పెద్ద రచ్చ అయితే తప్ప.. సామాన్యంగా.. సస్పెన్షన్ వేటు వేయరు. కానీ… 45ఏళ్లకే పెన్షన్ విషయంలో.. ప్రభుత్వాన్ని ఆ ముగ్గురూ తీవ్రంగా ఇరుకున పెట్టడంతో.. సభ నుంచి పంపేయడానికే.. సస్పెన్షన్ ను వాడుకున్నారు.