తెలుగు రాష్ట్రాలు రెండూ అసెంబ్లీ సీట్ల పెంపు గురించి చాలా కాలంగా, ఆశగా ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలుసు. దానికి తగినట్లే రెండు రాష్ట్రాల్లో నాయకులు కూడా, ఆశావహులతో ఆడుకుంటున్నారు. ఈ సీట్ల పెంపు గురించి రోజుకు ఒక రకంగా మాట్లాడుతున్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో రాజకీయ జీవుల మధ్య ఈ అంశం మళ్ళీ చర్చకు వస్తోంది. ఈనెల 24న ప్రారంభం అయ్యే పార్లమెంట్ సమావేశాల్లోనే సీట్ల పెంపు బిల్లు సభలో పెట్టేస్తాం అంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గతంలో ప్రకటించిన నేపథ్యంలో చర్చ మళ్ళీ మొదలైంది.
తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలను పెంచుకోవచ్చునని విభజన చట్టం చెబుతోంది. చట్టం చెబుతున్నది కదా తక్షణం కొత్త సీట్లు అందుబాటులోకి వచ్చేస్తాయని, కొత్తగా రాజకీయాలు చేయడం ప్రారంభించవచ్చు అని ఎదురు చూస్తున్నవారు చాలామంది ఉన్నారు. వారు చాలదన్నట్లు, చంద్రబాబు నాయుడు, కెసిఆర్ లు కొత్త అసెంబ్లీ సీట్ల ఆశ చూపించి విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నుంచి బోలెడు మందిని తమ పార్టీలో చేర్చేసుకుంటున్నారు. ఎటూ, సీట్లు పెరుగుతాయి అందరికీ అవకాశాలు కల్పిస్తాం అనే కబురునే ప్రతి ఒక్కరికీ చెబుతున్నారు. చంద్రబాబు అయితే అటు పార్టీ వారిని, కొత్తగా రాదలచుకుంటున్న వారిని కూడా ఇదే డైలాగ్ తో బుజ్జగిస్తున్న సంగతి మనం గమనిస్తూనే ఉన్నాం.
సాంకేతికంగా అయితే 2019 ఎన్నికల సమయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త సీట్లు అందుబాటులోకి రాబోయేది జరగదని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వేర్వేరు సందర్భాల్లో చెబుతూనే ఉన్నారు. అయితే జనం ఆశలు మాత్రం పెరుగుతూ పోతున్నాయి. రాష్ట్ర నాయకుల మాటలకు తోడు, కేంద్ర మంత్రి వెంకయ్య వంటి వారు కూడా కొత్త సీట్లు ఇదిగో వచ్చేస్తున్నాయి, అదిగో వచ్చేస్తున్నాయి అంటూ ఊరిస్తున్నారు. వెంకయ్య అయితే నేను కేంద్ర శాఖలు అందరితో మాట్లాడేసా, బిల్లు కూడా రెడీ అయిపోతున్నది అని చెప్పారు. సోమవారం మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్ కూడా వచ్చేస్తుందని అన్నారు. తీరా ప్రస్తుతం ఆ వాతావరణం ఏమీ కనిపించడం లేదు. మరి.. కొత్త అసెంబ్లీ సీట్ల ఆశావహుల కలలు ఎప్పటికి తీరుతాయో తెలియడం లేదు.