కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు జనాభా లెక్కలు తేల్చేందుకు రెడీ అయ్యింది. షెడ్యూల్ ప్రకారం 2021లో చేయాల్సిన జనగణన… కోవిడ్ కారణంగా వాయిదా పడిన నేపథ్యంలో, వచ్చే నెల నుండి జనాభా లెక్కలు తేల్చేందుకు హోంశాఖ సమాయత్తం అవుతోంది.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం… తెలంగాణ, ఏపీలో ఇప్పుడున్న అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంది. తెలంగాణలో 119స్థానాల సంఖ్య కనీసం 153కు పెంచాల్సి ఉంది. ఇక 175 స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో ఆ సంఖ్య 229కు పెరగనుంది.
అయితే, ఈ అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపును కేంద్ర ప్రభుత్వం జనగణనతో ముడిపెట్టిన నేపథ్యంలో… 2026వరకు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఈ లోపు కొత్త జనాభా లెక్కలు వస్తాయి కాబట్టి దాని ఆధారంగా ఏ నియోజకవర్గాన్ని పునర్విభజించాలి, ఏ నియోజకవర్గం కొత్తగా ఏర్పాటు చేయాలి, ఏ నియోజకవర్గం రిజర్వ్ చేయాల్సి ఉంటుంది అనే అంశాలను తేల్చబోతున్నారు.
నిజానికి 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందే సీట్లు పెరుగుతాయంటూ ప్రచారం జరిగింది. కేసీఆర్ ఈ మాట చెప్పే అప్పట్లో చేరికలను ప్రోత్సహించినా… కేంద్రం జనగణనకు ముడిపెట్టడంతో అప్పట్లో ఆగిపోయింది.
ప్రస్తుతం కేంద్రం 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని… పథకాలు, సంక్షేమ పథకాల రూపకల్పన చేస్తోంది.