బిజెపి ఎంపి, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అద్యక్షుడు కంభంపాటి హరిబాబు ఎట్టకేలకు ఒక వాస్తవాన్ని వెల్లడించారు.విభజన కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శాసనసభ స్థానాల సంఖ్క పెరగబోతున్నట్టు జరిగే ప్రచారాలలో పస లేదని తేల్చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో హరిబాబు సీట్ల పెంపుదల సులభం కాదని బహుశా ఇప్పుడు జరగకపోవచ్చని స్పష్టంగా చెప్పారు. నిజానికి బిజెపి నేతలలో చాలా మంది ఈ మాట చెబుతూనే వున్నారు. ఒకటి రెండు సార్లు అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వంటి వారు ఇచ్చిన సంకేతాలు తప్ప మోడీ ప్రభుత్వం అధికారికంగా ఎలాటి సూచన చేసింది లేదు. రాజకీయంగా మనకు లాభం లేనప్పుడు ఎందుకు సీట్లు పెంచాలన్న ప్రశ్న బిజెపి అద్యక్షుడు అమిత్షా నే లేవనెత్తుతున్నారట. అయితే ఇతర పార్టీల నుంచి భారీగా ఫిరాయింపులను ప్రోత్సహించిన టిడిపి టిఆర్ఎస్ పాలకపార్టీలకు మాత్రం అంతర్గతంగా ఆశావహుల ఒత్తిళ్లను తట్టుకోవడానికి ఆందోళనలను తగ్గించడానికి సీట్ల పెంపు ఒక అస్త్రంలా ఉపయోగపడుతుంటుంది. కొద్ది వారాల కిందట ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ విషయమై సానుకూల సంకేతాలు వచ్చినట్టు చెప్పుకున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల ముగిసిన శాసనసభ సమావేశాల చివరి రోజున చట్టసభల స్థానాల పెంపుపై గట్టిగా మాట్లాడారు. వచ్చే పార్లమెంటు సమావేశాలలో దీనిపై పోరాడతామని ప్రకటించారు.అంటే కేంద్రం అటు వైపు ఆలోచించడం లేదని అంగీకరించారన్న మాట.అయితే ఆ పార్టీ ఎంపి వినోద్ కుమార్ వంటి వారు మాత్రం సీట్ల సంఖ్య పెంపుపై నిరంతరం ఆశావహంగా మాట్లాడుతూనే వుంటారు.