ప్రజా సమస్యలను గురించి రోజుల తరబడి చర్చించడానికి మరో కొత్త భవనం అందుబాటులోకి వచ్చింది. కోట్లాది రూపాయల ప్రజా సొమ్మును వెచ్చించి అద్భుతః అనే స్థాయిలో నిర్మించారు. అధునాతనమైన ఎసి సౌకర్యాలతో పాటు, కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించి కార్పొరరేట్ సౌకర్యాలకు ఏ మాత్రం తగ్గని రీతిలో అద్భుతంగా నిర్మించారు. ఈ కొత్త భవనం మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా ఎక్కువే ఉంటుందనడంలో సందేహం లేదు. ఆ ఖర్చుకు అదనంగా సభ్యులకు ఇచ్చే సొమ్ముల ఖర్చు కూడా ప్రజాసేవ పద్దులోనే కలిపేస్తారు. మరి కొత్త భవనంలో అయినా కాస్త కొత్తగా ప్రయత్నం చేస్తారా? బూతుల పంచాంగం కాకుండా ప్రజా సమస్యలను వినిపిస్తారా? చట్టసభల్లోకి చాలా మంది కొత్తవారు అడుగుపెడుగుతున్నారు కానీ చర్చల రచ్చల విషయంలో మాత్రం కొత్తవారు కూడా పాతవాళ్ళకు ఏ మాత్రం తగ్గడం లేదు. అధినేతల మెప్పుకోసం తాపత్రయపడుతూ వాళ్ళ విలువను దిగజార్చుకుంటున్నారు. చట్ట సభల విలువను కూడా పాతాళానికి తీసుకెళ్తున్నారు. మొత్తంగా గెలిపించిన ప్రజలందరూ కూడా అవమానంగా ఫీలయ్యేలా చేస్తున్నారు.
ప్రజల ముందుకు వచ్చినప్పుడల్లా నీతుల వర్షం కురిపించే నాయకులు, విలువలు-విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్స్ అనే స్థాయిలో తమను తాము పొగుడుకుంటూ ఉండే నాయకులు చట్టసభల్లో మాత్రం దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో వినిపిస్తున్న స్థాయి బూతులు పల్లె పంచాయితీ సభల్లో కూడా వినిపించడం లేదు. గాలికి తిరిగే ఆవారాగాళ్ళ నోటి నుంచి వచ్చే స్థాయి మాటలు చట్ట సభల సభ్యుల నోటి నుంచి….అది కూడా చట్టసభల్లోనే వినిపిస్తూ ఉండడం మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ అవమానకరం అనే విషయంలో సందేహం లేదు. అంతా చూస్తే ఈ తిట్ల పురాణం కూడా వాళ్ళను గెలిపించిన ప్రజల ప్రయోజనం కోసం కాకుండా వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత గొప్పల కోసం వినిపిస్తూ ఉండడం ఇంకా దారుణం. కనీసం కొత్త భవనంలో అయినా ఈ పంథా మారుతుందేమో చూడాలి. కొత్త భవనం అద్బుతంగా ఉంటుందని, అత్యున్నతంగా ఉంటుందని అప్పుడే ప్రచారం చేసుకుంటున్నారు. మరి చర్చలు కూడా అంతే అద్భుతంగా, అత్యున్నతంగా ఉండేలా అధికార పక్షం వారు ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి. ప్రతి పక్షనేతను రెచ్చగొట్టడం, ప్రతిపక్షనేతను కించపర్చడమే లక్ష్యంగా కాకుండా ప్రజా సమస్యలను చర్చించడం కోసం సభను నడుపుతారేమో చూడాలి. అలాగే ప్రతిపక్ష నేతతో పాటు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకునే మహానేత గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రమే కాకుండా కాస్త ప్రజాసమస్యలను వినిపించడానికి కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి. అలా జరగకుండా కొత్త భవనంలో కూడా …..సేం టు సేం రచ్చ…అదే పంచాంగం వినిపిస్తే మాత్రం సభలో ఉన్న సభ్యులందరూ ప్రజల దృష్టిలో ఇంకా ఇంకా చులకన అయిపోవడం ఖాయం. ఆ తర్వాత మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చి పిల్లలను ఎలా పెంచాలి? అవినీతికి దూరంగా ఎలా ఉండాలి? విలువలను ఎలా కాపాడుకోవాలి అని చెప్పి గొప్పగా మాట్లాడుతూ ఉంటే మాత్రం జనాలకు ‘నేను హీరో…నేను గొప్పవాడిని’ అని చెప్పుకుంటూ కామెడీ పండించే కమెడియనే గుర్తొస్తూ ఉంటాడు. ఆ చట్టసభల సభ్యులను చూసి వాళ్ళను గెలిపించిన ఓటర్లు నవ్వుకుంటే అది వాళ్ళ తప్పు కాదు.